వెస్టిండీస్‌తో సిరీస్.. వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు?
ABN , Publish Date - Sep 15 , 2026 | 05:50 PM
వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి టీమిండియా జట్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి టీమిండియా జట్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయనుంది. ముఖ్యంగా చాలాకాలంగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌కు మరో అవకాశం దక్కుతుందా? గాయాల నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యను వన్డే జట్టులోకి తీసుకుంటారా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
హార్దిక్ పాండ్య సెప్టెంబర్ 20న మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా-ఎతో పుదుచ్చేరిలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత్-ఎ జట్టులో అతడిని ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే వెస్టిండీస్‌తో తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుంది. దీంతో పాండ్య అప్పటికి 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసేంత ఫిట్‌గా ఉంటాడా? అన్నది సెలెక్టర్లకు కీలక ప్రశ్నగా మారింది. పాండ్య అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డి ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ.. అతడు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నాడు. మరోవైపు సూర్యాంశ్ షెడ్గే, వెంకటేశ్ అయ్యర్ గాయాలతో బాధపడుతున్నారు.
పంత్‌కు వన్డే జట్టులో చోటు దక్కేనా?
ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రిషభ్ పంత్ టెస్టు వైస్ కెప్టెన్సీతో పాటు వైట్‌బాల్ జట్లలోనూ చోటు కోల్పోయాడు. అయితే ప్రస్తుతం వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆసియా క్రీడల్లో ఉండటంతో పంత్‌కు వన్డే జట్టులో మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే కేఎల్ రాహుల్‌కే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఆసియా క్రీడలకు వెళ్లనున్న నేపథ్యంలో రాహుల్.. శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పంత్‌ను వన్డే జట్టులోకి తీసుకోకపోతే.. ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పంత్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు కెప్టెన్‌గా పంపి ఇరానీ కప్‌లో ఆడించే అవకాశం ఉంది.
ఐపీఎల్ కెప్టెన్లకు చోటు?
శ్రేయస్ అయ్యర్ ఆసియా క్రీడలతో బిజీగా ఉండటంతో వన్డే జట్టులో నాలుగో స్థానానికి రుతురాజ్ గైక్వాడ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. రిజర్వ్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను తీసుకునే అవకాశం ఉండగా.. మిడిలార్డర్ బ్యాకప్‌గా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. గైక్వాడ్, పాటిదార్ ఇద్దరూ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత భారత్ ‘ఎ’ తరఫున ఆడనున్నారు. భారత్ ‘ఎ’ జట్టుకు గైక్వాడ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకు తిరిగి జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున ఆడుతున్న హర్ష్ దూబే గాయపడటం ఇందుకు కారణం. మరోవైపు బుధవారం జరిగే సెలెక్షన్ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? అన్న అంశంపై బీసీసీఐ అధికారులతో అగార్కర్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..
అది సర్వసాధారణం.. నఖ్వీతో ఫ్రెండ్లీ చాట్‌పై సైకియా రియాక్షన్