Share News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..

ABN , Publish Date - Sep 15 , 2026 | 04:55 PM

ఆసియా కప్‌లో 12 వికెట్లతో అదరగొట్టిన భారత యువ స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: చరిత్ర సృష్టించిన శ్రీచరణి.. తొలి భారత బౌలర్‌గా..
Shreecharani

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు భారీ పురోగతి సాధించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో అజేయంగా గెలిచి ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. టోర్నీలో 12 వికెట్లతో అదరగొట్టిన యువ స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజాగా 804 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.


ఆల్‌టైమ్ టాప్ రేటింగ్ పాయింట్లతో శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. ఈ జాబితాలో ఆమె రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షట్ 806 పాయింట్లతో శ్రీచరణి కంటే మెరుగైన రేటింగ్ సంపాదించుకుంది. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టన్ కూడా 802 పాయింట్ల మార్క్‌ను గతంలో అందుకుంది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 800కు పైగా రేటింగ్ సాధించిన అరుదైన ప్లేయర్ల సరసన శ్రీచరణి స్థానం దక్కించుకోవడం విశేషం.


రెండో స్థానానికి దీప్తి శర్మ..

ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన దీప్తి శర్మ.. టోర్నీలో 14 వికెట్లు పడగొట్టింది. దీంతో తాజాగా విడుదలైన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఫలితంగా టాప్‌-2 స్థానాలను భారత బౌలర్లే కైవసం చేసుకోవడం విశేషం.


బ్యాటర్ల విభాగంలో..

ఆసియా కప్‌లో బ్యాట్‌తో చెలరేగిన భారత యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ కూడా ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకొచ్చింది. టోర్నీలో 47.20 సగటుతో 236 పరుగులు చేసిన షఫాలీ.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకుంది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ షఫాలీ ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ బెత్‌ మూనీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. టాప్ 5 ప్లేయర్ల స్థానంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.


ఇవి కూడా చదవండి:

టీమిండియాలో చోటు కోసం ఎదురుచూడటం లేదు: భువనేశ్వర్ కుమార్

ఇమ్రాన్ ఖాన్ విషయంలో జోక్యం చేసుకోండి.. తమ ప్రభుత్వానికి ఆసీస్ మాజీ కెప్టెన్ల లేఖ

Updated Date - Sep 15 , 2026 | 05:15 PM