Share News

రోహిత్ శర్మ-ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఘనత

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:16 PM

చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.

రోహిత్ శర్మ-ప్రసిద్ధ్ కృష్ణ అరుదైన ఘనత
Rohit Sharma, Prasidh Krishna

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని ఘనతకు వారిద్దరూ తమ ఖాతాలో వేసుకున్నారు. రెండో వన్డేకు దూరమైన ప్రసిద్ధ్.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చి 5 వికెట్లతో చెలరేగాడు. అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లను కుదేలు చేశాడు. అయితే ప్రసిద్ధ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ మూడు క్యాచ్‌లను పట్టడం విశేషం.


మ్యాచ్ రెండో ఓవర్ తొలి బంతికే ప్రమాదకర బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఔట్ చేసి ప్రసిద్ధ్ భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత రహ్మత్ షా, ఇబ్రహీం జర్దాన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ మూడు క్యాచ్‌లను రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లు ఒకే బౌలర్-ఫీల్డర్ తీసుకున్న తొలి భారత జోడీగా ప్రసిద్ధ్-రోహిత్ నిలిచారు. అంతర్జాతీయ పురుషుల వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో జోడీగా చరిత్ర సృష్టించారు.


రోహిత్ మరో రికార్డు..

ప్రసిద్ధ్ బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ.. ఓ రికార్డును సమం చేశాడు. ఒక వన్డే మ్యాచ్‌లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న మూడో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అంతకుముందు 2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వీవీఎస్ లక్ష్మణ్, 2018లో బంగ్లాదేశ్‌పై బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్ ఈ ఫీట్ నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: భారత మహిళలు గెలుపు జోరు కొనసాగిస్తారా?

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

Updated Date - Jun 20 , 2026 | 06:25 PM