Share News

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:13 PM

ఐపీఎల్‌ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో అవకాశాలు రాకపోతే గాయాల సాకు చెప్పి స్వదేశంలో వేరే టోర్నీల్లో ఆడుతున్నారని ఆరోపించాడు. అలాంటి విదేశీ క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.


‘ఐపీఎల్ వేలంలో ఒక ఫ్రాంచైజీ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. తాము అందుబాటులో ఉండటం లేదని చెప్పేవారిపై బీసీసీఐ ఇప్పటికే రెండేళ్ల నిషేధం విధిస్తోంది. ఆ నిబంధన బాగుంది. అదే సమయంలో కొందరు విదేశీ ప్లేయర్లు గాయం పేరు చెప్పి టోర్నీ మధ్యలోనే స్వదేశాలకు వెళ్తున్నారు. తుది జట్టులో చోటు దక్కకపోతే స్వదేశంలో లోకల్ టోర్నీల్లో ఆడుతున్నారు. అలాంటివారిపై కూడా బీసీసీఐ నిషేధం విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఐపీఎల్ అంటే చాలామంది ప్లేయర్లు తేలికగా తీసుకుంటున్నారు. కొన్నిసార్లు తమ దేశ బోర్డులతో కుమ్మక్కై.. గాయపడినట్లు సాకుగా చెబుతున్నారు. టోర్నీ మధ్యలో జట్టును వీడటం వల్ల ఫ్రాంచైజీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నాయి’ అని గావస్కర్ వెల్లడించాడు.


కాంట్రాక్ట్‌లు రద్దు చేయాలి..

‘ప్లేయర్ ఫీజులో 10 శాతం విదేశీ బోర్డుకు వెళ్తుంది. ఆ ప్లేయర్ ఆడితేనే ఫ్రాంచైజీల నుంచి బోర్డులకు ఆదాయం వస్తుంది. ఎవరైతే టోర్నీ మధ్యలోనే జట్టును వీడుతారో.. వారికి మ్యాచ్ ఫీజుల్లోనూ కోత విధించాలి. బీసీసీఐ ఇప్పుడు విదేశీ బోర్డులపై కాసుల వర్షం కురిపిస్తుంది. ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు ఖర్చు చేస్తుంటే.. పూర్తి టోర్నీకి అందుబాటులో ఉండటం ప్లేయర్ల బాధ్యత. ఓవర్సీస్ ప్లేయర్లు ఫ్రాంచైజీలకు సహకారం అందించడం లేదు. పూర్తి స్థాయి టోర్నీకి అందుబాటులో లేని ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను రద్దు చేయాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్‌గా ఐపీఎల్ గుర్తింపు పొందింది. అంతేకాదు, సాధారణ స్థాయి విదేశీ ఆటగాళ్లను కూడా మిలియనీర్లుగా మార్చే వేదికగా నిలిచింది. అలాంటి టోర్నీకి పూర్తి నిబద్ధత చూపాల్సిన బాధ్యత ప్రతి ఆటగాడిపైనా ఉంది’ అని గావస్కర్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

Updated Date - Jun 20 , 2026 | 03:13 PM