Share News

సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్.. జట్టును వీడిన రింకు సింగ్!

ABN , Publish Date - Feb 24 , 2026 | 08:16 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా గురువారం జింబాబ్వే-భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడి స్వగ్రామానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

సూపర్ 8లో జింబాబ్వేతో మ్యాచ్.. జట్టును వీడిన రింకు సింగ్!
Rinku Singh

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమిండియా.. జింబాబ్వేతో తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడి స్వగ్రామానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. తన కుటుంబ అత్యవసర కారణాల నేపథ్యంలో రింకు ఉన్నట్టుండి జట్టును వీడినట్టు తెలుస్తోంది.


లీగ్ స్టేజీని అజేయంగా ముగించిన భారత జట్టు.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో నెట్ రన్‌రేట్ ఒక్కసారిగా -3.800కి పడిపోయింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టంగా మారాయి. జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో జరగనున్న మ్యాచుల్లో టీమిండియా భారీ తేడాతో విజయం సాధిస్తేనే.. సెమీస్‌కు లైన్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం జట్టుకు పెద్ద ఆందోళన మారిన తరుణంలో.. రింకు సింగ్ ఇలా ఉన్నట్టుండి జట్టును వీడటంతో అభిమానులకు మరో టెన్షన్ మొదలైంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రింకు హాజరుకాలేదు. గురువారం మ్యాచ్‌కు ముందు మళ్లీ జట్టులో చేరుతాడా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.


ఇవి కూడా చదవండి:

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?

టీ20 ఆడాల్సిన పద్ధతి ఇది కాదు: సునీల్ గావస్కర్ ఫైర్

Updated Date - Feb 24 , 2026 | 08:16 PM