మీ పట్టుదల అందరికీ గర్వకారణం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:42 PM
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు.
స్పోర్ట్స్ డెస్క్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు నగరాల్లో పలు క్రీడల్లో పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులు అందిస్తున్నారు. అలానే తమ విజయాలతో దేశానికి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. క్రీడాకారులకు, క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు.
‘ప్రతి క్రీడాకారుడికి.. మీ అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్‌కు నివాళులర్పిస్తున్నా’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలంటే కేవలం గెలవడం మాత్రమే కాదని తాను బలంగా నమ్ముతానని అన్నాడు. క్రీడలు.. కలలు కనడం, కష్టపడటం, ఎదురుదెబ్బలను తట్టుకొని ముందుకు సాగడం నేర్పిస్తాయని పేర్కొన్నాడు. జాతీయ క్రీడాదినోత్సవం నాడు యువతను మరింత ఎక్కువగా ఆటలు ఆడేలా ప్రోత్సహిద్దామని శిఖర్ ధావన్ వెల్లడించాడు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అడ్రస్‌లో లేరంటూ.. పేర్లు గల్లంతు!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన