Share News

డోపింగ్ టెస్టు.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు!

ABN , Publish Date - May 09 , 2026 | 03:33 PM

టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులు జారీ చేసింది.

డోపింగ్ టెస్టు.. యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మకు నోటీసులు!
Yashasvi Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(NADA) నోటీసులు జారీ చేసింది. నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్(RTP)లో భాగమైన ప్లేయర్లు తమ లొకేషన్ వివరాలు, రోజులో ఒక గంట సమయం తప్పనిసరిగా ముందుగానే తెలియజేయాలి. ఆ సమయానికి డోప్ కంట్రోల్ అధికారులు వెళ్లి ప్లేయర్లకు టెస్టు చేస్తారు. చెప్పిన సమయానికి ప్లేయర్లు అక్కడ లేకపోతే దాన్ని‘మిస్డ్ టెస్టు’గా నమోదు చేస్తారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు డోప్ టెస్టుకు హాజరుకాకపోవడానికి గల కారణాలను తెలియజేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు యశస్వి, షఫాలీకి అవకాశం కల్పించారు. నోటీసుల జారీ గురించి కూడా నాడా.. బీసీసీఐ, ఐసీసీకి సమాచారం అందించింది.


గతేడాది డిసెంబర్ 17న యశస్వికి, నవంబర్ 7న షఫాలీకి డోప్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అధికారులు వెళ్లిన సమయానికి వారిద్దరు టెస్టు చేయించుకోవడానికి అందుబాటులో లేరు. దీంతో వారిపై ‘మిస్డ్ టెస్టు’ నమోదు చేశారు. మరోసారి నాడా ఫిబ్రవరిలో వీరిద్దరి నుంచి వివరణ కోరింది. కానీ యశస్వి, షఫాలీ స్పందించకపోవడంతో తాజాగా నోటీసులు జారీ చేసింది. ఒక్కసారి డోప్ టెస్టుకు హాజరుకాకపోతే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు. అయితే 12 నెలల వ్యవధిలో మూడుసార్లు డోపింగ్ టెస్టులకు హాజరుకాకపోతే రెండేళ్లపాటు నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అయితే జైస్వాల్, షఫాలీకి ఇది తొలి తప్పిదంగానే భావిస్తున్నారు. ఇకపై వారిద్దరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే తరహాలో 2019లో స్టార్ ప్లేయర్ పృథ్వీ షా డోపింగ్ కేసులో చిక్కుకున్నాడు. నిషేధిత పదార్థం తీసుకున్న కారణంగా అతడిపై 8 నెలల నిషేధం విధించారు. ఇదిలా ఉంటే, జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉండగా.. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌నకు షఫాలీ సిద్ధమవుతోంది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

Updated Date - May 09 , 2026 | 03:52 PM