Share News

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:56 PM

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ కీలక అధికారి, భారత మాజీ క్రికెటర్ జుబిన్‌ భారుచాను తమతో కలుపుకుంది.

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం
Mumbai Indians

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ మాజీ కీలక అధికారి, భారత మాజీ క్రికెటర్ జుబిన్‌ భారుచాను తమతో కలుపుకుంది. భారుచాను ‘డైరెక్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌’గా నియమిస్తున్నట్లు ఎంఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ముంబై ఇండియన్స్‌ వ్యవస్థలోని వివిధ పనితీరు విభాగాలను సమన్వయం చేస్తూ జట్టు నాయకత్వ బృందంతో కలిసి భారుచా పనిచేయనున్నాడు. 16 ఏళ్లుగా రాజస్థాన్‌ రాయల్స్‌తో అనుబంధం కొనసాగించిన ఆయన.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించనున్నాడు.


ఆర్ఆర్‌తో 16 ఏళ్ల ప్రయాణం..

జుబిన్‌ భారుచాకు ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. 2008లో తొలి ఐపీఎల్‌ సీజన్‌ నుంచే రాజస్థాన్‌ రాయల్స్‌తో అతడి అనుబంధం కొనసాగుతోంది. తొలుత టీమ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 2015 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నాడు. ఆ తర్వాత 2016-17లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌)కు టెక్నికల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2018లో తిరిగి రాజస్థాన్‌ రాయల్స్‌లో చేరి డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌, హై పెర్ఫార్మెన్స్‌ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.


భారుచా పర్యవేక్షణలో రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి పలువురు భారత ఆటగాళ్లు మెరుగైన క్రికెటర్లుగా ఎదిగారు. సంజు శాంసన్‌కు వ్యక్తిగతంగా మెంటార్‌గా వ్యవహరించిన అతడు.. యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌, వైభవ్‌ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. తలేగావ్‌లోని రాజస్థాన్‌ రాయల్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో యువ ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో భారుచా ప్రత్యేక ముద్ర వేశారు.


ఎంఐలో భారీ బాధ్యతలు

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్‌ అర్హత సాధించలేకపోవడంతో ఫ్రాంచైజీలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారుచాకు విస్తృతమైన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్కౌటింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఏడాది పొడవునా ఆటగాళ్ల అభివృద్ధి కార్యక్రమాలను మెరుగుపరచడం, ఆఫ్‌సీజన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టడం వంటివి భారుచా ప్రధాన బాధ్యతల్లో ఉండనున్నాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టులోనూ టాలెంట్‌ స్కౌటింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించే పనిని ఆయన చేపట్టనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

Updated Date - Aug 22 , 2026 | 06:01 PM