రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు: కైఫ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:11 PM
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో అతడి భవితవ్యంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ విఫలమవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారని తెలిపాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘రోహిత్ శర్మ విఫలం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆ సవాళ్లను అతడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును ముందుండి నడిపించాడు. ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో మంచి ప్రదర్శనలు కనబరిచాడు. తాజాగా అఫ్గాన్‌పై చివరి మ్యాచ్‌లో 79 పరుగులు చేశాడు. కొన్నిసార్లు తక్కువ స్కోర్ చేశాడని.. అతడి క్లాస్‌ను అంచనా వేయడం సరికాదు. అభిమానులుగా 2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని మనమందరం కోరుకోవాలి. రోహిత్-విరాట్ అనుభవం టీమిండియాకు చాలా అవసరం’ అని కైఫ్ పేర్కొన్నాడు.
ఇది మంచి చిక్కే: గిల్
అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు రోహిత్ లేదా యశస్విల్లో ఎవరిని ఓపెనర్‌గా తీసుకుంటారనే ప్రశ్నకు గిల్ సమాధానమిచ్చాడు. ‘ఇది మంచి చిక్కే. అందరూ ఫిట్‌నెస్‌తో ఉండి జట్టుకు అందుబాటులో ఉంటే.. అత్యుత్తమ 11 మంది తుది జట్టులో ఉంటారు. దానికి సంబంధించిన స్క్వాడ్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక యశస్వి జైస్వాల్ వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ లేకపోవడంతో అతడికి అవకాశం వచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అతడు ఇదే ఆటతీరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’ అని గిల్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే
ఫిఫా ప్రపంచ కప్: ఐవరీ కోస్ట్‌పై విజయం.. నాకౌట్‌కు జర్మనీ