సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:16 PM
ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను రెండో టీ20లో తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు ఇంకా గెలుపు రుచి చూడలేకపోతుంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ రద్దు కాగా, రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే ఐర్లాండ్ పర్యటన నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను రెండో టీ20లో తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన జట్టులోనూ సంజు శాంసన్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడికి రెస్ట్ ఇచ్చారా? వేటు వేశారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
‘టీ20 ప్రపంచ కప్‌లో చేసిన తప్పునే టీమిండియా మళ్లీ ఇప్పుడు చేస్తోంది. అప్పట్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. ప్రత్యర్థులు ఆఫ్ స్పిన్నర్లను తీసుకొచ్చినప్పుడు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓ ఘోర ఓటమి తర్వాత సంజు శాంసన్‌కు అనూహ్యంగా జట్టులో చోటు దక్కింది. అతడు వచ్చిన తర్వాత రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌తో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు కూడా ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిన తర్వాతే మార్పులు చేశారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ ఎడమచేతి బ్యాటర్లే. దీర్ఘకాలంలో ఈ జోడీ ఓపెనర్లుగా సరైన ఎంపిక కాదు. జట్టు టాపార్డర్‌లో తప్పనిసరిగా ఒక కుడిచేతి బ్యాటర్ ఉండాలి. సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, నేడు నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మూడో టీ20లో తలపడనున్నాయి. ఇప్పటికే 1-0 తేడాతో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటైన వైభవ్ సూర్యవంశీ.. మూడో టీ20లో భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ
ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!