టెక్నాలజీని దుర్వినియోగం చేశారు.. ఫిఫాపై క్రొయేషియా ఫిర్యాదు
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:39 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో క్రొయేషియా జట్టు నాకౌట్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టు ఫిఫాపై అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో క్రొయేషియా జట్టు నాకౌట్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టు ఫిఫాపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. నాకౌట్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ(వీఏఆర్)తో పాటు ట్రియోండాలో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీని దుర్వినియోగం చేశారని క్రొయేషియా ఫుట్‌బాల్ సమాఖ్య ఆరోపించింది.
రౌండ్ ఆఫ్-32లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 2-1తో ఓడింది. స్టాపేజ్ టైమ్‌లో జోస్కో గ్వార్డియోల్ చేసిన గోల్‌ను తొలుత రిఫరీ చెల్లుబాటు చేశాడు. అయితే సుదీర్ఘ వీఏఆర్ పరిశీలన అనంతరం ఆ గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఫిఫా ఉపయోగిస్తున్న ట్రియోండా(బంతి పేరులోని సెన్సార్ డేటా ప్రకారం, గోల్‌కు ముందు ఇగోర్ మాటనోవిచ్ జుట్టుకు బంతి స్వల్పంగా తాకిందని గుర్తించి ఆఫ్‌సైడ్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రీప్లేల్లో మాత్రం ఆ గోల్ చెల్లుబాటయ్యేలా కనిపించడంతో వివాదం చెలరేగింది.
ఫిఫా స్పందనిదే..
ఈ ఘటనపై ఫిఫా స్పందించింది. ట్రియోండాలోని ఐఎంయూ (IMU) సెన్సార్లు బంతికి జరిగిన అత్యంత స్వల్ప స్పర్శను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉన్నాయని, దీంతో రిఫరీలు మరింత కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలరని వివరణ ఇచ్చింది. అయితే క్రొయేషియా ఫుట్‌బాల్ సమాఖ్య ఈ వాదనను తిరస్కరించింది. తీవ్రమైన తప్పిదాలను మాత్రమే సరిదిద్దడం వీఏఆర్ ఉద్దేశమని, కళ్లకు కనిపించని సూక్ష్మ డేటా ఆధారంగా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. అంతేకాకుండా, పోర్చుగల్‌కు ఇచ్చిన పెనాల్టీ నిర్ణయంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సందర్భంలో వీఏఆర్ జోక్యం అవసరం లేదని ఆరోపించింది.
ఫిఫా వివరణ ఇవ్వాలి..
క్రొయేషియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధి టోమిస్లావ్ పాకాక్ ఈ విషయంపై మాట్లాడాడు. ‘మా అభ్యంతరం రిఫరీ వ్యక్తిగత నిర్ణయాలపై కాదు. ఆ నిర్ణయాలకు దారితీసిన ప్రక్రియపైనే. వీఏఆర్ ప్రోటోకాల్‌ను సరిగా అమలు చేయలేదు. గ్వార్డియోల్ చేసిన గోల్‌ను ఆట స్ఫూర్తికి విరుద్ధంగా రద్దు చేశారు. ఆ గోల్ వేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఫుట్‌బాల్‌లో టెక్నాలజీని స్వాగతిస్తున్నాం. కానీ దానిని ఈ విధంగా ఉపయోగించడం ఫిఫాకు, జట్లకు, అభిమానులకు మేలు చేయదు. మా అభిమానులు, ఆటగాళ్ల నిరాశను ఈ ఫిర్యాదు తగ్గించకపోయినా.. ఈ నిర్ణయాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఫిఫాను అధికారికంగా కోరుతున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ
ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!