ఫిఫా ప్రపంచ కప్: అమెరికా ఓటమి.. ‘ట్రంప్ డ్యాన్స్’ చేసిన బెల్జియం ప్లేయర్
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:49 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అమెరికా ఓడిపోవడంతో ట్రంప్‌పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత బెల్జియం స్టార్ ప్లేయర్ రొమేలు లుకాకు చేసిన సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆతిథ్య దేశం అమెరికాపై బెల్జియం 4-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెల్జియం క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్ ప్లేయర్ బలోగన్‌పై ఫిఫా నిషేధాన్ని ఎత్తివేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడిందనే వార్తలు ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమంలో అమెరికా ఓడిపోవడంతో ట్రంప్‌పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత బెల్జియం స్టార్ ప్లేయర్ రొమేలు లుకాకు చేసిన సెలబ్రేషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్ తరచూ చేసే ఓ డ్యాన్స్ స్టెప్‌ను అనుకరిస్తూ లుకాకు సంబరాలు చేసుకోవడంతో అభిమానులు దీనిని ట్రంప్‌పై వ్యంగ్యంగా చేసిన చర్యగా చర్చించుకుంటున్నారు.
మైదానంలోనే సమాధానం చెప్పాం..
మ్యాచ్ అనంతరం బెల్జియం మిడ్ ఫీల్డర్ యూరీ టిలెమాన్స్ కూడా బలోగన్ వివాదంపై స్పందించాడు. ‘బాలోగన్‌కు మళ్లీ ఆడే అవకాశం ఇచ్చారన్న వార్త తెలిసిన వెంటనే మేమంతా సమావేశమయ్యాం. మాటలతో కాదు.. మైదానంలోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదే చేశాం. జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని మేము భావించాం. అమెరికాపై ఒత్తిడి పెడితే వారు తప్పులు చేస్తారని ముందే అంచనా వేశాం. అదే వ్యూహం విజయవంతమైంది’ అని అతడు వివరించాడు. ఇదెలా ఉంటే, అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ట్రంప్‌పై నెట్టింట ట్రోల్స్, మీమ్స్ మొదలయ్యాయి. కాగా లుకాకు చేసిన 'ట్రంప్ డ్యాన్స్' మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ
ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!