Share News

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:06 AM

లిజెలీ లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమె ఆడుతున్న నాక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆ బ్యాటర్ రూపమే. భారీ కాయం ఉన్నా.. వయసు పెరిగిపోతున్నా నిలకడగా రాణిస్తూ వార్తల్లో నిలుస్తుంది.

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ
Lizelle Lee

ఇంటర్నెట్ డెస్క్: 86, 67, 46, 43.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌కు ఈ రన్స్ బాదడం అంత కష్టమేమీ కాదు. అయినా అందరూ అంతగా ఆశ్చర్యపోవడానికి కారణం.. ఆడిన బ్యాటర్ రూపం. మహిళల క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని భారీ అవతారంలో ఆ క్రికెటర్ ఉండటమే. ఆమె పేరే.. లిజెలీ లీ(Lizelle Lee). డబ్ల్యూపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంది. అటు బ్యాటర్‌గా సూపర్ నాక్‌లు ఆడటమే కాదు వికెట్ కీపర్‌గా అసామాన్య క్యాచ్‌లు అందుకుంది.


ఎన్నో ఘనతలు..

కెరీర్‌ ఆరంభం నుంచి లిజెలీ విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరు. 2013లో దక్షిణాఫ్రికా దేశవాళీ మహిళల టీ20 లీగ్‌లో 84 బంతుల్లోనే 169 పరుగులతో అజేయంగా నిలిచి అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఆ రోజుల్లో మహిళల క్రికెట్లో అలాంటి మెరుపు ఇన్నింగ్స్‌ అరుదు. దీంతో ఆ తర్వాతి ఏడాదే దక్షిణాఫ్రికా జాతీయ జట్టులోకి వచ్చేసింది. ఓపెనర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. తర్వాత మిడిలార్డర్లోనూ బ్యాటింగ్‌ చేసింది. దక్షిణాఫ్రికాకు 100 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన లిజెలీ.. 3 శతకాలు సహా 3315 పరుగులు చేసింది. 82 టీ20ల్లో ఒక సెంచరీ సహా 1896 పరుగులు సాధించింది. ఆమె రెండు టెస్టులూ ఆడింది. మహిళల బిగ్‌ బాష్‌లో ఆమెది పెద్ద కెరీరే. అందులో 104 మ్యాచ్‌ల్లో 2770 పరుగులు చేసింది. అందులో ఐదు శతకాలుండడం విశేషం.


రిటైర్మెంట్ తర్వాత డబ్ల్యూపీఎల్‌లోకి..

మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడానికి ముందే లిజెలీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయింది. బిడ్డకు జన్మనివ్వడంతో లీగ్‌ క్రికెట్‌కు కూడా విరామం ఇచ్చింది. తల్లి అయ్యాక లిజెలీ మరింత బరువు కూడా పెరిగింది. ఇక ఆమె ఆటకు పూర్తిగా దూరమవుతుందని అనుకున్నారంతా. కానీ మళ్లీ బిగ్‌ బాష్‌లోకి పునరాగమనం చేసి సత్తా చాటింది. వయసు పెరిగినా.. భారీ కాయంతో ఉన్నా నిలకడగా ఆడుతుండడంతో ఈ సీజన్‌ ముంగిట వేలంలో డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంఛైజీలు లిజెలీ పట్ల ఆసక్తి ప్రదర్శించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.30 లక్షలకు ఆమెను సొంతం చేసుకుంది. ఈ లీగ్‌లో గుజరాత్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులో గెలిచి.. ఫైనల్‌కు చేరుకుంది ఢిల్లీ. గురువారం ఫైనల్ పోరులో ఆర్సీబీతో తలపడనుంది. లిజెలీ తన జోరును తుది సమరంలోనూ కొనసాగిస్తుందనడంలో సందేహమే లేదు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

టీ20 ప్రపంచ కప్ 2026.. అతడు టీమిండియాకు కీలకం అవుతాడు: రికీ పాంటింగ్

Updated Date - Feb 04 , 2026 | 11:10 AM