విదేశీ జట్లు.. దేశీ మూలాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:05 AM
భారత క్రికెట్ క్రేజ్ ఖండాలు దాటింది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం మనోళ్లు బయటిదేశాలకు వెళ్లినా తమ క్రికెట్ మూలాలను మాత్రం మరవడం లేదు. ఈ క్రమంలో అనేక దేశాల జట్లలో...
టీ20 ప్రపంచ కప్ 3 రోజుల్లో
భారత క్రికెట్ క్రేజ్ ఖండాలు దాటింది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం మనోళ్లు బయటిదేశాలకు వెళ్లినా తమ క్రికెట్ మూలాలను మాత్రం మరవడం లేదు. ఈ క్రమంలో అనేక దేశాల జట్లలో మన సంతతి ఆటగాళ్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో.. భారత సంతతికి చెందిన దాదాపు మూడు డజన్ల మంది క్రికెటర్లు ఆయా జట్ల తరఫున బరిలోకి దిగనుండడం ఓ భావోద్వేగం.
అమెరికా, కెనడా లాంటి జట్లలో పూర్తిగా భారతీయుల ఆధిపత్యమే నడుస్తోంది. ఇప్పుడు వారంతా భారత్‌లో ఈ నెల 7 నుంచి జరగబోయే పొట్టి కప్‌లో బరిలోకి దిగనున్నారు. అమెరికా పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ వాంఖడేలో టీమిండియాకు ప్రత్యర్థిగా ఆడనుండడం చిరకాల జ్ఞాపకంగా మిగలనుంది. అలాగే ఇటలీ పేసర్ జస్‌ప్రీత్ సింగ్, నెదర్లాండ్స్ ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్ కూడా ఇదే తరహా అనుభవాన్ని చవిచూడనున్నారు. మొత్తం టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లలో.. కెనడాలో 11 మంది, అమెరికాలో 9 మంది, ఒమన్‌లో ఏడుగురు, యూఏఈలో ఏడుగురు భారత సంతతి క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలోని కొందరు ఆటగాళ్లపైౖ ఓ లుక్కేద్దాం..
దిల్‌ప్రీత్ బజ్వా
కెనడా జట్టు కెప్టెన్ అయిన దిల్‌ప్రీత్ బజ్వా పంజాబ్‌లోని గుర్‌దాస్ పూర్‌లో జన్మించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన 23 ఏళ్ల బజ్వా.. 2020లో కెనడా వెళ్లాడు. పంజాబ్ తరఫున ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా, తగినన్ని అవకాశాలు రాకపోవడంతో కెనడా పౌరసత్వం తీసుకొన్నాడు.
జస్‌ప్రీత్ సింగ్
యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన ఇటలీ జట్టు తొలిసారి ప్రపంచక్‌పనకు అర్హత సాధించింది. ఈ జట్టులోని 32 ఏళ్ల పేసర్ జస్‌ప్రీత్ సింగ్‌ది పంజాబ్‌లోని పగ్వారా. 2006లో కుటుంబంతో సహా ఇటలీలోని మిలాన్‌కు వలస వెళ్లాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించాడు. డ్రైవర్‌గా పని చేస్తూనే క్రికెట్ ఆడుతున్న జస్‌ప్రీత్‌కు ఐసీసీ టోర్నీలో ప్రాతినిథ్యం దక్కడం నిజంగా సువర్ణావకాశం.
ఆర్యన్ దత్
డచ్ జట్టులో ఏకైక భారత సంతతి ఆటగాడు ఆర్యన్ దత్ (22). ఇతనికి 2023 వన్డే వరల్డ్‌కప్ ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. ఆఫ్ స్పిన్నర్ అయిన ఆర్యన్ ఈసారి మ్యాజిక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. 80ల్లోనే అతడి కుటుంబం నెదర్లాండ్స్‌కు వెళ్లింది. ఆర్యన్ అక్కడే జన్మించాడు. కానీ, భారత్‌లో తమ బంధువులు ఎంతో మంది ఉన్నారని చెబుతున్నాడు.
జతీందర్ సింగ్
పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 36 ఏళ్ల జతీందర్ సింగ్.. ఒమన్‌కు సారథ్యం వహిస్తున్నాడు. బ్యాటర్ అయిన సింగ్.. భారత తరఫున అవకాశం దక్కుతుందేమోనని చాలా కాలం ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. దీంతో ఒమన్‌కు వలస వెళ్లాడు. అయితే, ఈ వరల్డ్‌క్‌పలో ఒమన్ మ్యాచ్‌లన్నీ లంకలోనే జరగనున్నాయి.
మోనాంక్ పటేల్
యూఎస్ జట్టు సారథి అయిన మోనాంక్ పటేల్‌ది గుజరాత్. గతంలో ఇక్కడ సీనియర్ పేసర్ బుమ్రాతో కలసి యూత్ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అమెరికా జట్టులో ఓపెనర్‌గా సత్తా చాటు తున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అర్ధ శతకం కూడా చేశాడు.
సౌరభ్ నేత్రావల్కర్
అమెరికా జట్టులో లెఫ్టామ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్. ముంబైకి చెందిన 34 ఏళ్ల సౌరభ్.. భారత్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. 2024 టోర్నీలో పాక్‌పై అమెరికా సంచలన విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోసారి ఇలాంటి అద్భుతాలే చేయాలనుకొంటున్నాడు. ఎక్కడైతే క్రికెట్ ఆడడం ఆరంభించానో.. మళ్లీ అక్కడే మెగా టోర్నీలో పాల్గొనడం గొప్పగా ఉందని సౌరభ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!