Share News

రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:44 PM

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె , పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్‌2026లో పరాగ్వేపై ఫ్రాన్స్‌ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్ చేశారు.

రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
Kylian Mbappe

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ మైదానంలో మొదలైన పంతాలు, పట్టింపులు ఇప్పుడు రాజకీయ వివాదంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన కీలక మ్యాచ్‌లో పరాగ్వేపై ఫ్రాన్స్ 1-0 తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ క్లియాన్ ఎంబాపె, పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్‌కు కరచాలనం ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాక అతడి ముఖంపైనే కేకలు వేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వివాదంల్లో అమరిల్లాను ఉద్దేశిస్తూ ఎంబాపె మాట్లాడాడు. ' మేడమ్.. అమరిల్లా. మీరు ఈ పదవి(సెనేటర్)కి అనర్హురాలు. ఫిఫా ప్రపంచ కప్‌ (FIFA World Cup 2026)లో గొప్ప ఆటతీరుతో చెమటోడ్చిన పరాగ్వేకు మీరు ప్రతినిధి కాలేరు. మీ జాత్యహంకారం వల్లే మీ ప్లేయర్లు కృషిని యావత్ ప్రపంచం మరిచిపోయింది. అయితే.. ఇలాంటి ద్వేషాన్ని, వివక్షను వ్యాప్తి చేసే స్వేచ్ఛను మీకు నేను ఎప్పటికీ ఇవ్వను’ అని ఎంబాపె పోస్టు పెట్టాడు.


ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా నొచ్చుకున్న అమరిల్లా.. ఏకంగా పరాగ్వే సెనేట్ హాల్‌లోనే ఎంబాపెపై విరుచుకుపడ్డారు. 'మొదటిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న మా పరాగ్వే కుర్రాడు ఎంతో వినయంతో చేయి చాపితే, ఈ వ్యక్తి కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇది ఎంతమాత్రం ఫ్రెంచ్ సంస్కృతి కాదు. రూసో, డెకార్టెస్, మాంటెస్క్యూ వంటి గొప్ప మేధావులను పుట్టిన నేల. అలాంటి ఫ్రాన్స్ సంస్కృతిని ఎంబాపె స్థాయికి దిగజార్చలేం' అని ఆమె సెనేట్ వేదికగా మండిపడ్డారు.


అంతేకాకుండా ఎక్స్ వేదికగా ఎంబాపెకు ఆమె ఒక బహిరంగ హెచ్చరిక కూడా జారీ చేశారు. 'పరాగ్వే ప్రజలతో పెట్టుకోవద్దు. గతంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డినో మా దేశంలో జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని మరువద్దు. నాపై రాజకీయ, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు ఎంబాపెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. అతను నాకు వెంటనే క్షమాపణ చెప్పాలి' అని హెచ్చరించారు.


మరోవైపు, ఈ వివాదంపై ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషాంప్స్ స్పందిస్తూ.. మైదానం బయట జరుగుతున్న ఈ గొడవలేవీ ఎంబాపెపై ప్రభావం చూపడం లేదని, అతను మానసికంగా చాలా బలంగా ఉన్నాడని తెలిపాడు. అతడు తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాడని స్పష్టం చేశాడు. ఏదేమైనా ఒక ఫుట్‌బాల్ ఆటగాడికి, దేశాధినేత స్థాయి సెనేటర్‌కు మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

నా వైపు నుంచి ఎలాంటి ద్వేషం లేదు.. యోగరాజ్ వివాదంపై స్పందించిన కపిల్ దేవ్

తిలక్ నెమ్మదిగా ఆడితే భవిష్యత్‌లో కెప్టెన్ అవుతాడు: క్రిష్ శ్రీకాంత్

Updated Date - Jul 09 , 2026 | 12:44 PM