Share News

ఇక టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు: కృష్ణమాచారి శ్రీకాంత్

ABN , Publish Date - Feb 25 , 2026 | 09:31 PM

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌ను ఇలా పక్కన పెట్టి ప్రయోగాలు చేయడమేంటని గంభీర్‌ను ప్రశ్నించాడు.

ఇక టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు: కృష్ణమాచారి శ్రీకాంత్
Krishnamachari Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టమయ్యాయి. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌ను ఇలా పక్కన పెట్టి ప్రయోగాలు చేయడమేంటని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నించాడు.


‘గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసేది అతడే కదా. ఇలాంటి వ్యూహాలతో ముందుకుసాగితే నష్టం తప్పదు. మిగతా జట్లు ఆడే మ్యాచ్‌ల ఫలితాల మీద ఇప్పుడు మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. ఓటమి తర్వాత గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుకున్నారు. అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించిన తర్వాత వీరు మాట్లాడుకోవడానికి ఇంకేముంది?


ప్రధాన కోచ్‌గా గంభీర్ ఉన్నాడు. అతడి చుట్టూ ఇతర కోచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా సాధారణ నిర్ణయాలు తీసుకోలేరా? వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను ఎవరైనా జట్టు నుంచి తప్పిస్తారా? ఇంతకుముందు శుభ్‌మన్ గిల్ విషయంలోనూ ఇలాగే చేశారు. ఇకపై టీ20లలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే వైస్ కెప్టెన్లుగా ఉన్నవారినే జట్టు నుంచి బయటకు పంపుతున్నట్లు కనిపిస్తోంది’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 25 , 2026 | 09:31 PM