మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:46 PM
టర్కీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా బంతి తగిలి గాయపడిన సీగల్ పక్షికి ఆటగాడు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టర్కీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా బంతి తగిలి గాయపడిన సీగల్ పక్షికి ఆటగాడు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్తాంబుల్ ఫస్ట్ అమెచ్యుర్ లీగ్‌లో భాగంగా ఇస్తాంబుల్ యుర్డమ్ స్పోర్- మెవ్లానాకపి గుజెల్‌హిసార్ జట్లు ప్లే ఆఫ్ ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుండగా గోల్ కీపర్ ముహమ్మీత్ కొట్టిన బంతి అక్కడే ఎగురుతున్న సీగల్ పక్షికి బలంగా తగిలింది. వెంటనే అది మైదానంలోనే కుప్పకూలింది. ఇస్తాంబుల్ కెప్టెన్ కాటన్ హుటాహుటిన పక్షి దగ్గరికి చూశాడు. శ్వాస తీసుకోవడం లేదని గమనించి వెంటనే సీపీఆర్ చేసి కాపాడాడు. అక్కడే వైద్య బృందానికి సీగల్‌ను అప్పగించాడు.
ఈ విషయంపై కాటన్ స్పందించాడు. ‘మైదానంలో ఏదో పడుతున్నట్లు అనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూసేసరికి అది సీగల్ పక్షి. బంతి బలంగా తాకడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. దీంతో సీపీఆర్ చేయాలని అనుకున్నా. అదృష్టం కొద్ది పక్షిలో కదలిక కనిపించింది. ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినా.. ఛాంపియన్స్‌గా నిలివకపోయినా ఓ ప్రాణాన్ని కాపాడటమే ముఖ్యమని భావించాను’ అని కాటన్ వెల్లడించాడు. మ్యాచ్ కామేంటేటర్ స్పందిస్తూ.. ‘ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే అరుదైన క్షణం’ అంటూ వ్యాఖ్యానించాడు. సీగల్ పక్షిని పరీక్షించిన వైద్య బృందం.. దాని రెక్కలకు గాయమైందని ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. కాగా కాటన్ చేసిన పనికి నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇవి కూడా చదవండి:
బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి