Share News

Kranti Goud: 12 ఏళ్ల క్రితం పోయిన తండ్రి ఉద్యోగం.. కూతురు వల్ల తిరిగొచ్చింది!

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:40 AM

టీమిండియా మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గౌడ్ తిరిగి పోలీస్ శాఖలో పునర్నియామకం అయ్యాడు. 2012లో ఎన్నికల విధులు నిర్వహించడంలో పొరపాటు చేయడంతో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. అయితే భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో మున్నాసింగ్‌ గౌడ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు.

Kranti Goud: 12 ఏళ్ల క్రితం పోయిన తండ్రి ఉద్యోగం.. కూతురు వల్ల తిరిగొచ్చింది!
Kranti Goud

ఇంటర్నెట్ డెస్క్: ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం.. చిన్న పొరపాటు వల్ల పోతే! కుటుంబమంతా తిండికి కూడా నోచుకోలేక రోడ్డున పడితే.. పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. అది వాళ్ల బాధ్యత. అలాగే పెరిగిన ఓ ఆడపిల్ల.. దేశమంతా గర్వించే పని చేసి.. తన తండ్రికి గౌరవం తెచ్చి పెడితే! అంత వరకు బానే ఉంది కానీ.. దాదాపు 12 ఏళ్ల క్రితం చిన్న పొరపాటు వల్ల పోయిన ఉద్యోగం తన కూతురు వల్ల తిరిగొస్తే..! ఆ తండ్రికి ఆ ఆనందం మాటల్లో చెప్పడానికి కూడా రాదు. అదే జరిగింది టీమిండియా క్రికెటర్ క్రాంతి గౌడ్(Kranti Goud) విషయంలో!


ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలామె. ఆమె స్వస్థలం మధ్య ప్రదేశ్‌. క్రాంతి తండ్రి మున్నాసింగ్ గౌడ్ గతంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. 2012లో ఎన్నికల విధులు నిర్వహించడంలో పొరపాటు చేయడంతో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. అయితే భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో మున్నాసింగ్‌ గౌడ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీ నెరవేరడంతో ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకునే ప్రక్రియ పూర్తైంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ క్రీడాశాఖ మంత్రి విశ్వాస్‌ సరాంగ్‌ తాజాగా ధ్రువీకరించారు.


'ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వం క్రీడాకారుల విషయంలో ఎంత గౌరవంగా, సున్నితంగా ఉంటుందో తెలుపుతుంది. మున్నాసింగ్‌ గౌడ్‌ పోలీస్‌ యూనిఫామ్‌లో గౌరవప్రదంగా రిటైరవ్వొచ్చు' అని మంత్రి విశ్వాస్‌ అన్నారు.


అప్పట్లో మున్నాసింగ్‌ గౌడ్‌ను విధుల నుంచి తొలగించిన తర్వాత.. క్రాంతి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిసార్లు తాము తిండికి కూడా నోచుకోలేకపోయామని గతంలో క్రాంతి ఆవేదన వ్యక్తంచేసింది. అయినా క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించిన ఆమె భారత జట్టులో చోటు సంపాదించి.. కుటుంబానికి అండగా నిలిచింది. మొత్తానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చింది.


ఇవి కూడా చదవండి:

ఇండియా వద్దంటే.. పాకిస్తాన్‌లో ఆడతా: ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

Updated Date - Jan 07 , 2026 | 03:17 PM