వైభవ్ సూర్యవంశీతో ఇప్పుడు స్కోర్ సమం అయింది: జోఫ్రా ఆర్చర్
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:37 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఆసక్తికర పోటీ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు భారత్–ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మధ్య ఆసక్తికర పోటీ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు భారత్–ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. మూడో టీ20 అనంతరం వైభవ్‌తో తన పోటీపై ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మాంచెస్టర్‌లో అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో టీ20లో కూడా ఆర్చర్ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే ఈసారి చివరికి పైచేయి సాధించింది ఆర్చరే. ఐదు బంతుల్లో 13 పరుగులు చేసిన వైభవ్‌ను క్యాచ్ ఔట్ చేసి అతడి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మ్యాచ్ అనంతరం ఈ పోటీ గురించి ఆర్చర్ మాట్లాడాడు. ‘ఇప్పుడు మా ఇద్దరి మధ్య స్కోరు సమం అయింది. అతడు సిక్సర్లు బాదాడు.. నేను ఔట్ చేశాను. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఏం జరుగుతుందో చెప్పలేం. చివరికి ఎవరు మెరుగ్గా రాణిస్తారో వారే విజేత అవుతారు’ అంటూ యువ బ్యాటర్‌కు ఆర్చర్ సరదాగా సవాల్ విసిరాడు.
ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత్ ఘోరంగా విఫలమైంది. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టిన ఆర్చర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే భారత్ తప్పనిసరిగా నాలుగో టీ20లో విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం బ్రిస్టల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఓడితే సిరీస్ ఇంగ్లండ్ ఖాతాలో చేరనుంది.
ఇవి కూడా చదవండి:
నా జీవితంలోనే అత్యుత్తమ పుట్టినరోజు కానుక ఇది: సౌరభ్ గంగూలీ
మెస్సితో వాగ్వాదానికి దిగిన ఈజిప్టు కోచ్.. వీడియో వైరల్