Share News

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:46 AM

పాకిస్థాన్ జట్టుపై వస్తోన్న విమర్శలపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తీవ్రంగా స్పందించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్.. నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్
Joe Root

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ జట్టుపై వస్తోన్న విమర్శలపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తీవ్రంగా స్పందించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్.. నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ వస్తోన్న విమర్శలపై రూట్ స్పందించాడు. వారిలో పోరాట పటిమనే కనిపించడం లేదని, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ అత్యంత బలహీనమైన జట్టు అనడాన్ని రూట్ తప్పుబట్టాడు.


‘పాకిస్థాన్ జట్టు ఎలాంటి పోరాటం చేయడం లేదని చెప్పడం రెండు జట్లను అగౌరవపరచడమే. వాళ్లను మేం సవాల్‌గానే తీసుకున్నాం. ప్రత్యర్థి జట్టును తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. మేం చాలా బాగా ఆడటం వల్లే వాళ్లకు అవకాశం రాలేదు. పరిస్థితులు, పిచ్‌ల స్వభావాన్ని మేం చాలా త్వరగా అర్థం చేసుకున్నాం. ఒక జట్టు అద్భుతంగా ఆడిందని, మరో జట్టు పూర్తిగా చెత్తగా ఆడిందని చెప్పడం సులభమే. కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఒక జట్టు అద్భుత ప్రదర్శన చేస్తే.. ప్రత్యర్థి జట్టు పూర్తిగా పేలవంగా ఆడిందని అర్థం కాదు. అలాగే ఒక జట్టు విఫలమైతే.. ప్రత్యర్థి జట్టు గొప్పగా ఆడలేదని కూడా చెప్పలేం. ఈ రెండింటి మధ్య ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’ అని రూట్ వెల్లడించాడు.


తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..

పాకిస్థాన్‌ జట్టులో ఇటీవల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో టెస్టు తర్వాత ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేయడంతో పాటు టెస్టు కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కూడా పీసీబీ తొలగించింది. వైట్‌బాల్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌కు టెస్టు బాధ్యతలు అప్పగించింది. ఏడుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోగా.. వారిలో ఐదుగురు ఇప్పటివరకు టెస్టు అరంగేట్రం చేయలేదు. దీంతో మూడో టెస్టు పూర్తిగా భిన్నంగా ఉండొచ్చని రూట్‌ వివరించాడు. ‘గత రెండు మ్యాచ్‌ల్లో ఏం జరిగిందన్నది పక్కన పెడితే.. ఈ వారం మాకు పూర్తిగా భిన్నమైన సవాల్‌ ఎదురు కానుంది. పాక్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకే మేం పూర్తి అప్రమత్తతతో బరిలోకి దిగుతాం’ అని రూట్‌ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!

ఆసియా క్రీడలు.. అవి ఫైవ్‌స్టార్ కాకపోయినా మంచి హోటళ్లే: బీసీసీఐ

Updated Date - Sep 09 , 2026 | 09:46 AM