జియో కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలు లేనట్లే!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:48 PM
బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసార ఒప్పందాన్ని జియోస్టార్ రద్దు చేసుకుంది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని టీస్పోర్ట్స్(బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్)కు జియోస్టార్ లేఖ రాసినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసార ఒప్పందాన్ని జియోస్టార్ రద్దు చేసుకుంది. భారత్-బంగ్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ పరిణామం తర్వాత బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిషేధంపై పునరాలోచన చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించిన తర్వాత జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని టీస్పోర్ట్స్(బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్)కు జియోస్టార్ లేఖ రాసినట్లు సమాచారం.
ఒప్పందం ప్రకారం భాగస్వామ్య పక్షం గడువులోగా చెల్లింపులు చేయడంలో తరచూ విఫలమవడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అయితే మహిళల ప్రీమియర్ లీగ్‌కు కూడా ఈ రద్దు వర్తించనుంది. కాగా బంగ్లా తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ ఉన్న సమయంలో.. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బంగ్లాలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆ నిషేధంపై పునరాలోచిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఇంతలోనే జియో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఈ నిర్ణయానికి భాగస్వాముల మధ్య ఉన్న ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరుపొందిన ఐపీఎల్‌ను బంగ్లాదేశ్ ఫ్యాన్స్ విశేషంగా ఆదరిస్తారు. తాజా నిర్ణయం వ్యూయర్‌షిప్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా జియో నిర్ణయంతో ఐపీఎల్ ప్రసారాల కోసం 2027 వరకు టీస్పోర్ట్స్‌కు ఉన్న అనుమతులు రద్దు అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు
కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!