ముంబై.. 13 ఏళ్ల తర్వాత
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:49 AM
ఐపీఎల్‌లో దశాబ్దానికి పైగా తమను వెంటాడుతున్న ఆరంభ మ్యాచ్ ఓటమి నుంచి ముంబై ఇండియన్స్ గట్టెక్కింది. 2012లో చివరిసారిగా తమ తొలి మ్యాచ్ గెలిచిన జట్టు ఆ తర్వాత...
నేటి మ్యాచ్
చెన్నై X రాజస్థాన్
వేదిక గువాహటి రా.7.30 నుంచి
ఆరంభ మ్యాచ్‌లో గెలుపు
రికెల్టన్, రోహిత్ మెరుపు ఇన్నింగ్స్
6 వికెట్లతో కోల్‌కతా ఓటమి
ముంబై: ఐపీఎల్‌లో దశాబ్దానికి పైగా తమను వెంటాడుతున్న ఆరంభ మ్యాచ్ ఓటమి నుంచి ముంబై ఇండియన్స్ గట్టెక్కింది. 2012లో చివరిసారిగా తమ తొలి మ్యాచ్ గెలిచిన జట్టు ఆ తర్వాత గత సీజన్ వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. కానీ ఈసారి మాత్రం కదం తొక్కింది. బౌలింగ్‌లో విఫలమైనా.. భారీ ఛేదనలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 81), రోహిత్ శర్మ (38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. దీంతో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్లతో గెలిచింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67), రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), ఫిన్ ఆలెన్ (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) రాణించారు. శార్దూల్ ఠాకూర్‌కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా శార్దూల్ నిలిచాడు.
మెరుపు ఆరంభం: 221 పరుగుల భారీ ఛేదనలో ముంబై ఇన్నింగ్స్ రాకెట్ వేగంతో సాగింది. ఓపెనర్లు రోహిత్, రికెల్టన్ బౌలర్లను చెడుగుడు ఆడేశారు. బౌండరీల వరద పారించారు. మూడో ఓవర్‌లోనే రోహిత్ 6, రికెల్టన్ 6,6తో 19 రన్స్ వచ్చాయి. ఐదో ఓవర్‌లో రోహిత్ 4,6,4తో 15 రన్స్ అందించాడు. ఆరో ఓవర్‌లో మరో రెండు సిక్సర్లతో హిట్‌మ్యాన్ 23 బంతుల్లోనే ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పవర్‌ప్లేలో జట్టు 80 పరుగులతో అదరగొట్టింది. అటు రికెల్టన్ తొమ్మిదో ఓవర్‌లో రెండు సిక్సర్లతో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్న రోహిత్ 12వ ఓవర్‌లో 4,6 బాదినా అనుకుల్ వెనక్కి పరిగెడుతూ అందుకున్న అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే సారథి సూర్య (16), రికెల్టన్ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అప్పటికే మెరుగైన స్థితిలో నిలిచిన ముంబై.. హార్దిక్ (18 నాటౌట్), తిలక్ (20) జోరుకు ఐదు బంతులు మిగిలుండగానే గెలిచింది.
రహానె-ఆలెన్ జోరుతో..: వాంఖడే వికెట్‌పై పచ్చిక ఉండడంతో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. కానీ కేకేఆర్ జోరుకు వారి వ్యూహం బెడిసికొట్టింది. ఓపెనర్లు రహానె, ఆలెన్ ఎదురుదాడితో ఆరంభం నుంచే పరుగుల వరద పారింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆలెన్ టీ20 వరల్డ్‌కప్ ఫామ్‌ను కొనసాగించాడు. మూడో ఓవర్‌లో అతను 4,6,6తో 17 రన్స్ అందించాడు. తర్వాతి ఓవర్‌లో రహానె 6,6.. ఆలెన్ 4,4,4తో హార్దిక్ 26 రన్స్ సమర్పించుకున్నాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనూ 11 పరుగులిచ్చాడు. అయితే జోరు మీదున్న ఆలెన్‌ను శార్దూల్ పెవిలియన్ చేర్చగా తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే జట్టు పవర్‌ప్లేలో 78/1 స్కోరుతో ఆధిపత్యం చూపింది. 8 ఓవర్లలోనే స్కోరు వంద దాటగా.. శార్దూల్ మరోసారి అండగా నిలిచి గ్రీన్ (18) వికెట్ తీశాడు. మరో ఎండ్‌లో రహానె ధాటిని కొనసాగిస్తూ 27 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే మధ్య ఓవర్లలో పరుగుల వేగం కాస్త తగ్గింది. దీనికి తోడు కుదురుకున్న రహానెను శార్దూల్ అవుట్ చేశాడు. అయితే రఘువంశీ బ్యాట్‌కు పనిజెప్పడంతో జట్టు రన్‌రేట్ మళ్లీ పుంజుకుంది. 15వ ఓవర్‌లో అతడి క్యాచ్‌ను రోహిత్ వదిలేశాడు. అదే ఓవర్‌లో అతను 4,6తో 17 రన్స్ అందించాడు. కానీ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేశాక రఘువంశీ 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. అప్పటికే అతను నాలుగో వికెట్‌కు రింకూతో కలిసి 30 బంతుల్లో 60 రన్స్ జోడించాడు. చివర్లో బుమ్రా తన రెండు ఓవర్లలో పరుగులను కట్టడి చేసి కేకేఆర్ స్కోరును 220కి పరిమితం చేశాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా: రహానె (సి) హార్దిక్ (బి) శార్దూల్ 67, ఆలెన్ (సి) తిలక్ (బి) శార్దూల్ 37, గ్రీన్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) శార్దూల్ 18, రఘువంశీ (సి) తిలక్ (బి) హార్దిక్ 51, రింకూ (నాటౌట్) 33, రమణ్‌దీప్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 220/4. వికెట్ల పతనం: 1-69, 2-109, 3-145, 4-205; బౌలింగ్: బౌల్ట్ 4-0-38-0, హార్దిక్ 3-0-39-1, ఘజన్‌ఫర్ 4-0-51-0, బుమ్రా 4-0-35-0, శార్దూల్ 4-0-39-3, మార్కండే 1-0-16-0.
ముంబై: రికెల్టన్ (రనౌట్) 81, రోహిత్ (సి) అనుకుల్ (బి) వైభవ్ 78, సూర్యకుమార్ (సి) రింకూ (బి) కార్తీక్ 16, తిలక్ (సి-సబ్) మనీష్ (బి) నరైన్ 20, హార్దిక్ పాండ్యా (నాటౌట్) 18, నమన్ ధిర్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.1 ఓవర్లలో 224/4. వికెట్ల పతనం: 1-148, 2-179, 3-184, 4-215; బౌలింగ్: వైభవ్ 4-0-52-1, ముజరబాని 3-0-34-0, వరుణ్ 4-0-48-0, కార్తీక్ 4-0-43-1, నరైన్ 3-0-30-1, అనుకుల్ 1.1-0-15-0.
1
ఐపీఎల్‌లో తన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (23 బంతుల్లో)ని నమోదు చేసిన రోహిత్. అలాగే ఒకే ప్రత్యర్థి (కేకేఆర్)పై ఎక్కువ పరుగులు (1161) చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. విరాట్ (పంజాబ్‌పై 1159)ను అధిగమించాడు.
1
ఐపీఎల్‌లో ముంబైకిదే భారీ ఛేదన (221).
1
ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు (190) ఆడిన విదేశీ ఆటగాడిగా సునీల్ నరైన్.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్