మా కుర్రాళ్లు ఎంత కసితో ఉన్నారో అర్థమైంది: ఇషాన్ కిషన్
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:12 PM
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. అరంగేట్రంలోనే ప్రఫుల్ 4, సకిబ్ హుస్సేన్ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో ఎస్ఆర్‌హెచ్ తేలిపోతోందని నిన్నటి వరకు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలే లేకుండా బరిలోకి దిగిన హైదరాబాద్ యువ బౌలర్లు సత్తా చాటారు. అరంగేట్రంలోనే కుర్రాళ్లు ప్రఫుల్ 4, సకిబ్ హుస్సేన్ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ఈ విజయంతో మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి. చాలా సంతోషంగా ఉంది. కేవలం గెలుపు గురించి కాకుండా.. మా యువ బౌలర్ల సత్తా ఏంటో అందరికీ తెలిసింది. వారి నుంచి నేను ఆశించింది నెరవేరింది. స్వేచ్ఛగా ఆడి వారి ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలు.. ఫలితం సానుకూలంగా వస్తుందని తెలుసు. రాజస్థాన్‌పై అదే చేసి చూపించాం. ఈ ఘనత పూర్తిగా యువ బౌలర్లదే. ఈ ప్రదర్శనతో మా కుర్రాళ్లు ఎంత కసితో ఉన్నారో అర్థమైంది. ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ అదరగొట్టారు. ఎప్పుడెప్పుడు ప్రధాన మ్యాచుల్లో ఆడాలనే వారి ఆకలికి ఇది నిదర్శనం. మా బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్‌తో కలిసి వారు చాలా కష్టపడ్డారు. ఈ మ్యాచ్‌లో మేం తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు’ అని ఇషాన్ తెలిపాడు.
అందుకే కీపింగ్ చేయలేదు..
‘నేను వికెట్ కీపింగ్ చేయకపోవడానికి కూడా ఓ కారణముంది. స్టంప్స్ వెనుక ఉండటం వల్ల మిగతా ప్లేయర్లతో మిస్ కమ్యూనికేషన్ అవుతోంది. బౌలర్లతో తరచూ మాట్లాడకపోతే ప్రణాళికలు సరిగ్గా అమలుచేయలేం. అందుకే వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించా. దీంతో బౌలర్లకు చేరువగా ఉండి సూచనలు చేయగలుగుతున్నా. ఫీల్డింగ్‌లో ఏవైనా మార్పులు కావాలంటే చర్చిస్తున్నా. మున్ముందూ ఇదే కొనసాగే అవకాశం లేకపోలేదు’ అని ఇషాన్ స్పష్టం చేశాడు. కాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సలీల్ అరోరా వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌కు యముడయ్యాడు.. ఎవరూ ప్రఫుల్ హింగే!
అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్