Share News

అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:41 PM

ఐపీఎల్ 2026లో మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ సత్తా చాటింది. అరంగేట్రంలో ప్రఫుల్ హెంగే, సకిబ్ హుస్సేన్ చెలరేగిన వేళ.. ఆర్ఆర్ 159 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

అరంగేట్రంలోనే సత్తా చాటిన సన్‌రైజర్స్ పేసుగుర్రం.. ఎవరీ సకిబ్ హుస్సేన్
Sakib Hussain

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ సీజన్‌లో అజేయంగా కొనసాగుతూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓటమి రుచి చూపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు ఎస్ఆర్‌హెచ్‌కు తొలి బంతికే బిగ్ షాక్.. అభిషేక్ శర్మ ఔట్. కెప్టెన్ ఇషాన్ కిషన్(91) పుణ్యమా అని హైదరాబాద్ 216 పరుగులు చేయగలిగింది. ఈ స్కోర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ లాంటి ఓపెనర్లకు కొట్టిన పిండి. రాజస్థాన్‌కు మరో గెలుపు ఖాయమనుకున్నారంతా.. కానీ సొంత మైదానంలో సన్‌రైజర్స్ సత్తా చాటింది. అరంగేట్రంలో ప్రఫుల్ హెంగే, సకిబ్ హుస్సేన్ చెలరేగిన వేళ.. ఆర్ఆర్ 159 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.


అయితే తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టిన పేసర్ ప్రఫుల్ గురించే చర్చ అంతా! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతడికే దక్కడంతో ప్రఫుల్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. కానీ ఇదే మ్యాచ్‌లో ప్రఫుల్ కంటే కూడా తక్కువ పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన సకిబ్ హుస్సేన్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. తన 4 ఓవర్ల స్పెల్‌లో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 17వ ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వెనువెంటనే రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇంతకీ ఎవరీ సకిబ్ హుస్సేన్..?


అరుదైన ఘనత..

ఈ 21 ఏళ్ల పేసుగుర్రం స్వస్థలం బిహార్. చిన్న వయసులోనే అపారమైన ప్రతిభ కనబర్చి ఉప్పల్‌లో ఆర్ఆర్‌పై బీభత్సం సృష్టించాడు. 17 ఏళ్లకే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అరంగేట్రం చేసి.. ఆడిన రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీ 2025-2026 సీజన్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. అతడి ప్రదర్శనలను గమనించిన ఐపీఎల్ స్కౌట్లు.. ఈ సీజన్ వేలంలో రూ.30లక్షల బేస్ ప్రైజ్‌తో తీసుకున్నారు. అదే ధరకు ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రంలోనే ఈ ఫీట్ అందుకున్న ఏడో ఆటగాడిగా సకిబ్ నిలిచాడు.


మ్యాచ్ అనంతరం సకిబ్ హుస్సేన్ తన ఆటపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. ‘ప్రతి ఆటగాడు ఇలాంటి డెబ్యూనే ఆశిస్తాడు. ఈ రోజు నా కల నిజమైంది. ఈ మ్యాచ్‌లో నేను ఆడుతున్నట్లు.. మా కోచ్ వరుణ్ ఒక రోజు ముందు చెప్పాడు. జట్టు గెలుపులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ దూకుడు.. సచిన్ రికార్డుకు పొంచి ఉన్న ముప్పు

ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్

Updated Date - Apr 14 , 2026 | 03:06 PM