Share News

వైభవ్‌ను కావాలనే నిరుత్సాహపరుస్తున్నారా?.. క్రిస్ శ్రీకాంత్ ఫైర్

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:59 AM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వైభవ్‌ను కావాలనే నిరుత్సాహపరుస్తున్నారా?.. క్రిస్ శ్రీకాంత్ ఫైర్
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. సంచలన ప్రదర్శనలు చేస్తున్న వైభవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో వరుస అవకాశాలు ఇవ్వకపోవడం సరికాదని మండిపడ్డాడు. న్యూజిలాండ్‌తో ఐదో టీ20లోనూ అతడిని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు సంధించాడు.


‘వైభవ్ సూర్యవంశీకి వరుసగా అవకాశాలు ఇవ్వండి. ముగ్గురు ఓపెనర్లకు ఓ స్పష్టత ఇవ్వండి. మీలో ఒకరు మూడు మ్యాచ్‌లు ఆడతారు.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మరొకరికి అవకాశం ఇస్తామని చెప్పండి. అలా కాకుండా వైభవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదు. ఐర్లాండ్‌తో జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనే ఆడించాల్సింది. అక్కడే తప్పు చేశారు. ఆ తర్వాత భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటనకు వచ్చినప్పుడు కూడా వైభవ్‌కు అవకాశం ఇవ్వలేదు. అవును.. సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి ప్రదర్శన బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత్‌కు వచ్చిన వెస్టిండీస్ బౌలింగ్ దళంపై ఈ వయసులో నేను కూడా పరుగులు చేయగలనని అనుకుంటున్నా. అలాంటి సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సింది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.


వన్డేల్లోనూ చోటివ్వాలి..

‘ఆ కుర్రాడికి అవకాశం ఇచ్చి తీర్చిదిద్దండి. ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరుస్తున్నారు. వెస్టిండీస్ సిరీస్‌లో వైభవ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదో చెప్పాలి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ అభిషేక్, వైభవ్ ఓపెనింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లలో ఆడగలడు. అతడికి వన్డే జట్టులోనూ చోటు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆ కుర్రాడిలో అపారమైన ప్రతిభ ఉంది’ అని క్రిస్ శ్రీకాంత్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

కివీస్ సిరీస్‌కు భువీని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు: ఇర్ఫాన్ పఠాన్

సంజునే నా ఫస్ట్ ఛాయిస్.. అభిమానికి అశ్విన్ అదిరిపోయే కౌంటర్!

Updated Date - Nov 02 , 2026 | 12:02 PM