Share News

Irfan Pathan: అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:19 PM

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.

Irfan Pathan: అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం
Shami

ఇంటర్నెట్ డెస్క్: భారత్ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో సీనియర్ పేసర్‌ మహ్మద్ షమీకి మరోసారి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షమీ, అప్పటి నుంచి సెలెక్షన్‌కు దూరంగానే ఉన్నాడు.


గాయాల నుంచి కోలుకున్న అనంతరం కూడా షమీని ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లకు పక్కనపెట్టారు. ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక కాలేదు. ఇప్పుడు బ్లాక్‌క్యాప్స్‌తో వన్డే సిరీస్‌కూ అతడికి నిరాశే ఎదురైంది. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ షమీని ఎంపిక చేయకపోవడంపై మాజీ భారత ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్‌(Irfan Pathan) స్పందించాడు.


‘షమీ(Mohammed Shami ) నిన్న మొన్న వచ్చిన ఆటగాడు కాదు. 450-500 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌. 400కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాడిని పక్కనపెట్టి ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఆటగాడికీ ఫిట్‌నెస్ పరీక్షలు సహజమే. కానీ షమీ ఇప్పటికే 200 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా ఫిట్‌నెస్ సరిపోదంటే.. ఇంకా ఏ అతడు ఏం చేయాలి? అది సెలెక్షన్ కమిటీకే తెలియాలి’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.


నేనే షమీ స్థానంలో ఉంటే..

‘నేనైతే షమీ స్థానంలో ఉంటే ఐపీఎల్‌లో ఆడి విధ్వంసం సృష్టిస్తాను. కొత్త బంతితో నా పాత రిథమ్ చూపిస్తాను. దేశవాళీ క్రికెట్‌ను గుర్తిస్తారు కానీ ఐపీఎల్‌లో ప్రదర్శన ఇస్తే ప్రపంచమే చూస్తుంది. అక్కడ రాణిస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉండలేరు. అతడి కోసం తలుపులు పూర్తిగా మూసేయకూడదు’ అని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?

138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!

Updated Date - Jan 04 , 2026 | 12:19 PM