Share News

ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిందే.. ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 03:26 PM

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు.

ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిందే.. ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఎంఐ.. ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 18 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచినప్పటికీ ఎంఐ బౌలర్ల పేలవ ఫామ్ వల్ల ఆర్సీబీ 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బుమ్రా, బౌల్ట్, మయాంక్ మార్కండే వంటి బౌలర్లు పూర్తి ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు.


‘కొత్త బంతితో బౌల్ట్‌కు ఇంతకుముందు ఉన్న స్వింగ్, వేగం ఇప్పుడు కనిపించడం లేదు. వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. పిచ్ ఫ్లాట్‌గా ఉండొచ్చు.. ఎలాగైనా ఉండొచ్చు.. కానీ బౌల్ట్ అంటే బౌల్టే! తిరిగి పుంజుకుని అదరగొడతాడనే నమ్మకం ఉంచాలి. అతడిలో ఆ సామర్థ్యం ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి గణాంకాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి ఆ దశలో ముంబై బౌలింగ్ మెరుగుపరచడం అత్యంత కీలకం. మరోవైపు స్పిన్ విభాగంలో మయాంక్ మార్కండేపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు అతడి నుంచి మంచి ప్రదర్శనలు రాలేదు’ అని ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.


కాగా ఆర్సీబీపై బౌల్ట్ తన 4 ఓవర్ల కోటాలో 50 పరుగుల సమర్పించుకుని కేవలం ఒక్క వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో బౌల్ట్‌కిదే తొలి వికెట్. మయాంక్ మార్కండే 2 ఓవర్లు వేసి ఏకంగా 40 పరుగులు ఇచ్చేశాడు. స్టార్ పేసర్ బుమ్రా.. ఈ సీజన్‌లో వికెట్ల ఖాతానే తెరవలేదు. ఆర్సీబీపై 4 ఓవర్లు వేసి 35 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా 240 పరుగుల భారీ స్కోర్‌ను అడ్డుకోవడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.


ఇవి కూడా చదవండి:

ఎంఐతో మ్యాచ్‌లో కోహ్లీకి గాయం.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నాడంటే?

రోమి బిందర్ ఫోన్ వినియోగించడానికి అదే కారణం!

Updated Date - Apr 13 , 2026 | 03:26 PM