ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. ఫ్రాంచైజీల అభిప్రాయాలు కోరిన బీసీసీఐ
ABN , Publish Date - Aug 31 , 2026 | 10:07 AM
ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బీసీసీఐ మరోసారి పునరాలోచనకు సిద్ధమవుతోంది. ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఈ నిబంధనపై పది ఫ్రాంచైజీల నుంచి తాజాగా అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బీసీసీఐ మరోసారి పునరాలోచనకు సిద్ధమవుతోంది. ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఈ నిబంధనపై పది ఫ్రాంచైజీల నుంచి తాజాగా అభిప్రాయాలు సేకరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి (ఆగస్టు 31)లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని జట్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను సమీక్షిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రక్రియలో భాగంగానే ఫ్రాంచైజీల నుంచి అధికారికంగా అభిప్రాయాలు కోరినట్లు తెలుస్తోంది.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బ్యాటింగ్-బౌలింగ్ సమతూకంపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా 2026 ఐపీఎల్ సీజన్‌లో భారీ స్కోర్లు నమోదవ్వడంతో ఈ నిబంధనపై మరోసారి విమర్శలు పెరిగాయి. ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా అదనపు బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండటంతో బౌలర్ల పాత్ర, ప్రాధాన్యం తగ్గుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పది జట్ల నుంచి ఫీడ్‌బ్యాక్
ఐపీఎల్-2026 కెప్టెన్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక అంశాలపై అన్ని ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు ప్లేయర్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ), అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు, ప్లేయింగ్ కండిషన్స్ తదితర అంశాలపైనా జట్ల నుంచి సూచనలు కోరింది. ఆయా జట్ల క్రికెట్ ఆపరేషన్స్ విభాగాలతో చర్చించి సమగ్ర అభిప్రాయాలను ఆగస్టు 31లోగా సమర్పించాలని బీసీసీఐ సూచించింది.
ఐపీఎల్-2027లో ఈ రూల్ ఉంటుందా?
ఇప్పటివరకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను మరో సీజన్ కొనసాగించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే పలు జట్ల కెప్టెన్ల నుంచి అభ్యంతరాలు రావడంతో సమీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. తాజాగా ఫ్రాంచైజీల నుంచి మరోసారి అభిప్రాయాలు కోరడంతో పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది జట్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తర్వాతే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలో మార్పులు చేయాలా? కొనసాగించాలా? అనే దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మాత్రం ఈ రూల్ అమల్లోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
కౌంటీ ఛాంపియన్‌షిప్: ఆకిబ్ నబీకి సర్‌ప్రైజ్ ఛాన్స్.. సర్రే జట్టు తరఫున..
ప్రపంచ రికార్డు.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ