Share News

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

ABN , Publish Date - Sep 16 , 2026 | 04:45 PM

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. వచ్చే సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!
IPL 2027

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. వచ్చే సీజన్‌కు ముందు నిర్వహించే మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో మూడుసార్లు విదేశాల్లోనే ఈ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో వేలం నిర్వహిస్తే లాజిస్టిక్స్‌ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే వేలం భారత్‌లో ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్‌- డిసెంబర్‌ మధ్య మినీ వేలం జరిగే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది జరిగే మెగా వేలం మాత్రం విదేశీ గడ్డపై జరిగే అవకాశం ఉందని సమాచారం. భారత్‌లో చివరిసారిగా కొచ్చి ఐపీఎల్‌ వేలానికి ఆతిథ్యమిచ్చింది.


వారణాసిలో WPL మ్యాచ్‌లు?

మరోవైపు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2027)పై కూడా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. వచ్చే సీజన్‌ డబ్ల్యూపీఎల్ వేలాన్ని అక్టోబర్‌ 29న కొచ్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో వారణాసిలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్‌ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. 2027 జనవరి నాటికి స్టేడియం పూర్తిస్థాయిలో సిద్ధమైతే అక్కడ కొన్ని మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. వారణాసితో పాటు ముంబైలోని బ్రబోర్న్‌, వడోదరలోని కోటాంబి స్టేడియాలు కూడా వచ్చే ఏడాది WPL మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నట్లు సమాచారం.


ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై నిర్ణయం వాయిదా

ఐపీఎల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై తుది నిర్ణయం మాత్రం వాయిదా పడింది. ఈ నిబంధనపై అన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై మరోసారి చర్చించి.. అక్టోబర్‌లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా

తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం

Updated Date - Sep 16 , 2026 | 04:46 PM