Share News

ఐపీఎల్ 2027: సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి.. బ్యాటింగ్ కోచ్ హస్సికి సీఎస్కే గుడ్ బై!

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:50 AM

ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను నియమించిన ఆ ఫ్రాంచైజీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2027: సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి.. బ్యాటింగ్ కోచ్ హస్సికి సీఎస్కే గుడ్ బై!
Michael Hussey

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను నియమించిన ఆ ఫ్రాంచైజీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జట్టుతో 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, సీఎస్కే బ్యాటింగ్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీకి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చేపడుతున్న సీఎస్కే.. ఇప్పటికే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సైమన్స్‌తోనూ బంధాన్ని తెంచుకున్న సంగతి తెలిసిందే.


CSK.jpg

మైఖేల్‌ హస్సీని కొనసాగించకూడదన్న నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యం ఆయనకు అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే, హస్సీ ఐపీఎల్‌ 2027లో మరో ఫ్రాంచైజీ సహాయక సిబ్బందిలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జట్లతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్‌లో హస్సీ ఏ జట్టు డగౌట్‌లో కనిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.


ఐపీఎల్‌ 2027కు ముందు సీఎస్కే తన కోచింగ్‌ బృందాన్ని పూర్తిగా మార్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా జహీర్‌ ఖాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించడంతో పాటు.. సీఎస్కే మాజీ పేసర్‌ మోహిత్‌ శర్మకు బౌలింగ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఫీల్డింగ్‌ కోచ్‌ జేమ్స్‌ ఫోస్టర్‌ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారినట్లు సమాచారం. హస్సీ స్థానంలో బ్యాటింగ్‌ కోచ్‌గా ఎవరిని నియమిస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. సీఎస్కేలో జరుగుతున్న ఈ మార్పుల వెనుక ఆ జట్టు దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జట్టు భవిష్యత్తు ప్రణాళికలు, కోచింగ్‌ సిబ్బంది ఎంపికలో ఆయన సూచనలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మార్పులపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఆటగాడిగా, కోచ్‌గా ఐదు టైటిళ్లు

మైఖేల్‌ హస్సీకి సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆటగాడిగా జట్టుతో రెండు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన ఆయన.. కోచ్‌గా మరో మూడు టైటిళ్లలో భాగమయ్యాడు. తొలి ఐపీఎల్‌ సీజన్లలో సీఎస్కే బ్యాటింగ్‌ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ఏకంగా 733 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఆటగాడిగా జట్టుకు సేవలందించిన హస్సీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌ కోచ్‌గా కూడా కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తితో సీఎస్కే బంధం ముగియడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌ 2027కు ముందు కోచింగ్‌ సిబ్బందిలో ఇన్ని మార్పులు చేపడుతున్న నేపథ్యంలో.. కొత్త బృందంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌పై ఓటమికి బౌలింగ్ కోచ్ సమాధానం చెప్పాలి: గావస్కర్

249 పరుగులు చేసినా భారత్ ఓటమి.. ఎవరినీ నిందించలేను: గంభీర్

Updated Date - Oct 10 , 2026 | 10:52 AM