Share News

వెస్టిండీస్‌పై ఓటమికి బౌలింగ్ కోచ్ సమాధానం చెప్పాలి: గావస్కర్

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:55 AM

టీ20 క్రికెట్‌లో 249 పరుగుల భారీ స్కోరు చేసినా.. ప్రత్యర్థి లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తే బౌలింగ్‌ వైఫల్యం కాక మరేంటి? వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమిపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఇదే ప్రశ్న సంధించాడు.

వెస్టిండీస్‌పై ఓటమికి బౌలింగ్ కోచ్ సమాధానం చెప్పాలి: గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్‌లో 249 పరుగుల భారీ స్కోరు చేసినా.. ప్రత్యర్థి లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తే బౌలింగ్‌ వైఫల్యం కాక మరేంటి? వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమిపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఇదే ప్రశ్న సంధించాడు. బ్యాటర్లు తమ పని సమర్థంగా చేశారని, ఓటమికి ప్రధాన కారణం బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమేనని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌ కోచ్‌ కూడా ఈ ప్రదర్శనపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.


‘తొలి రెండు ఓవర్లలో కాస్త నెమ్మదించినప్పటికీ భారత్‌ 235-240 పరుగులు చేస్తుందని భావించా. కానీ ఆ అంచనాలను మించి మరో తొమ్మిది పరుగులు ఎక్కువే చేసింది. కాబట్టి బ్యాటర్లను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. వారు తక్కువ స్కోరు చేయలేదు. బౌలర్లు మాత్రం ఎలా బౌలింగ్‌ చేయాలో అలా చేయలేకపోయారు. ఈ బౌలర్ల నుంచి బౌలింగ్‌ కోచ్‌ ఏం ఆశించారు? వారు ఆ అంచనాలకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేశారా? లేదా? అన్నది కోచ్‌నే అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఈ ఓటమికి కూడా ఓ సమాధానం దొరుకుతుంది’ అని గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


అది పూర్తిగా అనవసరం: వరుణ్ ఆరోన్

భారత మాజీ పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌ కూడా జట్టు బౌలింగ్‌ వ్యూహంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి ఓవర్‌లోనే వెస్టిండీస్‌ రెండు వికెట్లు కోల్పోయినప్పుడు భారత బౌలర్లు పేస్‌తోనే ఒత్తిడి కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘పవర్‌ప్లేలో నాలుగో ఓవర్‌ను అక్షర్‌ పటేల్‌తో వేయించడం పూర్తిగా అనవసరం. షై హోప్‌, పావెల్‌ వంటి బ్యాటర్లు కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు పేసర్లతోనే నాలుగు ఓవర్లు వేయించాల్సింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాం’ అని ఆరోన్‌ పేర్కొన్నాడు. అక్షర్‌ వేసిన ఆ ఓవర్‌లో వెస్టిండీస్‌ 16 పరుగులు రాబట్టడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై భారీ ఛేజ్.. విండీస్ కెప్టెన్ హోప్ ఖాతాలో పలు రికార్డులు

మెరుపు ఇన్నింగ్స్.. కోహ్లీ రికార్డును సమం చేసిన సంజు శాంసన్

Updated Date - Oct 10 , 2026 | 09:55 AM