Share News

249 పరుగులు చేసినా భారత్ ఓటమి.. ఎవరినీ నిందించలేను: గంభీర్

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:09 AM

వెస్టిండీస్‌పై జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 250 పరుగుల టార్గెట్‌ను విండీస్ సులువుగా ఛేదించేసింది. అయితే ఇదే విషయంపై భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

249 పరుగులు చేసినా భారత్ ఓటమి.. ఎవరినీ నిందించలేను: గంభీర్
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో 249 పరుగుల భారీ స్కోరు చేసినా.. ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతే తప్పెవరిది? బౌలర్లదా? క్యాచ్‌లు వదిలేసిన ఫీల్డర్లదా? లేక జట్టు వ్యూహాల్లోనా? వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమి తర్వాత ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే ఇదే విషయంపై భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి అద్భుతంగా ఆడిందని అంగీకరిస్తూనే.. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తమ జట్టు విఫలమైందని స్పష్టం చేశాడు.


‘ఈ మ్యాచ్‌ పరిస్థితులను పరిశీలిస్తే.. రోస్టన్‌ చేజ్‌ స్పెల్‌ ఆటను మలుపు తిప్పింది. మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపింది. ఈ పిచ్‌పై అతడు బౌలింగ్‌ చేసిన విధానం అద్భుతం. తన లైన్‌ను మార్చుకుంటూ బ్యాటర్లను అయోమయానికి గురిచేశాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌ లాంటి ప్రమాదకర జట్లపై భారీ స్కోర్లను కాపాడుకోవాలంటే మనమూ కొత్త మార్గాలను అన్వేషించాలి. ఈ ఓటమికి ఎవరినీ బాధ్యులుగా చూపలేను. ఎవరినీ నిందించలేను. 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామన్నదే అసలు విషయం. వెస్టిండీస్‌ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారు విజయానికి అర్హులు. మేం ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది’ అని గంభీర్ స్పష్టం చేశాడు.


అది సహజమే..

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌.. రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత‌ షాయ్‌ హోప్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను విండీస్‌ వైపు తిప్పింది. దీంతో క్యాచ్‌ జారవిడవడంపై కూడా గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘టాస్‌ మన చేతుల్లో ఉండదు. క్యాచ్‌లు జారవిడవడం గతంలోనూ జరిగింది.. భవిష్యత్తులోనూ జరగొచ్చు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లు వదలరు. అందుకే ఇలాంటి విషయాల్లో ఎవరినీ నిందించలేం. ఎంత స్కోర్ చేస్తే గెలవగలమనే విషయాన్ని చెప్పలేం. రెండు వికెట్లు త్వరగా తీసిన తర్వాత 250 పరుగులు మంచి స్కోరని అనుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో వెస్టిండీస్‌ సాధించిన దానికి కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాలి’ అని గంభీర్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై భారీ ఛేజ్.. విండీస్ కెప్టెన్ హోప్ ఖాతాలో పలు రికార్డులు

మెరుపు ఇన్నింగ్స్.. కోహ్లీ రికార్డును సమం చేసిన సంజు శాంసన్

Updated Date - Oct 10 , 2026 | 09:10 AM