Share News

ఐపీఎల్ 2026: సూర్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి: అశ్విన్

ABN , Publish Date - Mar 24 , 2026 | 08:12 AM

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉండటంపై అభిమానులతో పాటు, క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.

ఐపీఎల్ 2026: సూర్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి: అశ్విన్
Ashwin

ఇంటర్నెట్ డెస్క్: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2026 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉండటంపై అభిమానులతో పాటు, క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2024లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను ట్రేడ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకుంది. కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఎంఐ ఫ్రాంచైజీ తీరు అప్పట్లో తీవ్ర విమర్శలు దారితీసింది. నాటి నుంచి నేటి వరకు హార్దిక్ కెప్టెన్సీపై చర్చలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మాట్లాడాడు.


‘ హార్దిక్ పాండ్యను తప్పించి ఎంఐకి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాలి. ఈ నిర్ణయం ఎప్పుడో జరిగిపోవాలి.. కానీ ఇప్పటికీ జరగలేదు. ప్రస్తుతం సూర్య టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకుంది. ఎంఐకి సూర్యని కెప్టెన్ చేయాలి. అయితే హార్దిక్ పాండ్య నాయకత్వ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్, రెండో సీజన్‌లో రన్నరప్‌గా జట్టును నిలిపిన ఘనత పాండ్యది. కానీ ముంబైకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి.


రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అభిమానులు ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎంఐలో హార్దిక్ తొలి సీజన్ మొత్తం ఒత్తిడిలోనే గడిచింది. ఇప్పుడు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ ఉండగా.. ఐపీఎల్‌లో తానే కెప్టెన్‌గా కొనసాగం అతడికి మానసికంగా సవాలే. అయినప్పటికీ సరైన మద్దతు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలిగితే పాండ్య మంచి కెప్టెన్ అని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో అతడి నుంచి మంచి ప్రదర్శనలు చూస్తామని ఆశిస్తున్నా’ అని అశ్విన్ వెల్లడించాడు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

పాక్ చేతిలో ఓడితే.. మా అభిమానులు ఆత్మహత్య చేసుకుంటారు: అఫ్గాన్ క్రికెటర్

షెడ్యూల్ ప్రకారమే లీగ్.. ఆ వార్తల్లో నిజం లేదు: ఐపీఎల్

Updated Date - Mar 24 , 2026 | 09:24 AM