పాక్ చేతిలో ఓడితే.. మా అభిమానులు ఆత్మహత్య చేసుకుంటారు: అఫ్గాన్ క్రికెటర్
ABN , Publish Date - Mar 24 , 2026 | 07:48 AM
పాకిస్థాన్‌పై గెలవడానికి తమ జట్టు ఎంతో పోరాడుతుందని అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్ అన్నాడు. పాక్ చేతిలో ఓడితే తమ అభిమానులు సూసైడ్ చేసుకునే వెళ్తారని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రతి అభిమానిలో హైటెన్షన్ ఉంటుంది. అయితే పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడితే కూడా అదే స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉంటుంది. పాక్‌పై తమ జట్టు గెలవాలని అఫ్గాన్ అభిమానులు బలంగా కోరుకుంటారు. ఆ జట్టు ప్లేయర్లూ అదే స్థాయిలో పాక్‌పై పోరాడతారు. ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టుకునేంత స్థాయికి దిగుతారు. అందుకే పాకిస్థాన్‌పై గెలిస్తే అఫ్గాన్ ఫ్యాన్స్ అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. ఓడితే మాత్రం సూసైడ్ చేసుకునే వరకూ వెళ్తారు. ఇదే విషయంపై అఫ్గాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిపోవడం అత్యంత బాధాకరమైనదిగా పేర్కొన్నాడు.
‘ఆసియా కప్ 2022 ఎడిషన్‌లో పాకిస్థాన్ చేతిలో మేం ఓడిపోయాం. నా గుండె పగిలిపోయేంత బాధ పెట్టిన ఫలితం అది. చాలా బాధతో అభిమానులు ఇంటిముఖం పట్టారు. చాలా మంది మైదానంలోనే ఏడ్చేశారు. మా దగ్గర భావోద్వేగానికి గురయ్యే ఫ్యాన్సే ఎక్కువ. ప్రజల కోసం ఆడే మేం కూడా చాలా బాధపడ్డాం. ఇప్పటికీ నాకు ఆ చేదు జ్ఞాపకాలు గుర్తున్నాయి. నేనెప్పుడైనా షార్జా స్టేడియంలోకి అడుగు పెడితే.. ఆ బాధాకరమైన ఓటమి గుర్తుకొచ్చేది. ఆ మ్యాచ్‌లో ఎలా ఆ పరాజయం చవిచూశామో ఇప్పటికీ నాకు అర్థం కాదు. తొలుత బ్యాటింగ్‌లో గొప్పగా రాణించలేకపోయినా.. బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాం. చివరి ఓవర్‌లో మాత్రం వరుసగా సిక్స్‌లు ఇచ్చేసి ఓడిపోయాం. దీంతో మా దేశంలో కొందరు అభిమానులు సూసైడ్ చేసుకున్నారు.
మేం క్రికెటర్లం. అఫ్గానిస్థాన్ ప్రజల కోసం మేం ఆడుతున్నాం. అభిమానుల ఆనందంలోనే మా సంతోషం ఉంది. ఇప్పుడు వారిని బాగా గుర్తుండిపోయే మ్యాచ్ ఏది అని అడిగితే.. ఠక్కున 2023 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన మ్యాచ్ అని చెబుతారు. క్రికెటర్‌గా ప్రత్యర్థికి చెందిన ఆటగాళ్లపై నాకెలాంటి వ్యక్తిగత కోపం, కక్ష ఉండదు. మా అభిమానులు మాత్రం పాక్‌ను ఓడించాలని గట్టిగా కోరుకుంటారు’ అని గుర్బాజ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్
పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు