Share News

పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:55 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు.

పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు
ICC player of the month February 2026

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన పురస్కారం లభించింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా(Player of The Month) ఫర్హాన్ ఎంపికయ్యాడు. అలానే మహిళల విభాగంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత సీమ్ బౌలర్ అరుంధతి రెడ్డి ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.


ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్( Sahibzada Farhan) అదరగొట్టాడు. ఒక్క భారత్‌పై తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు చెలరేగి ఆడాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలు బాదాడు. దీంతో ఒక ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌, అమెరికా పేస‌ర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌ల పోటీలో ఉన్నా.. వారిని కాదని ఈ అవార్డును అందుకున్నాడు ఫర్హాన్. అతడి కంటే ముందు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాకిస్థాన్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్‌ అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు.


ఇక మహిళల విభాగంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి(Arundhati Reddy)ని ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆసీస్‌పై 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర. ఆమె 10.87 సగటు, 7.25 ఎకానమీ రేటుతో సిరీస్‌ను ముగించింది. శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా సనా ఈ ఆవార్డు రేసులో నిలిచారు. అయితే చివరకు ఈ అవార్డు అరుంధతి రెడ్డిని వరించింది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!

18 ఏళ్ల ప్రయాణం నా కళ్ల ముందు మెదిలింది: విరాట్ భావోద్వేగం

Updated Date - Mar 23 , 2026 | 04:49 PM