Share News

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:04 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాక్ వ్యతిరేక సాయుధదళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
PSL 2026 news

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2026) అంతా గందరగోళంగా ఉంది. క్రికెట్ ప్రపంచం ముందు తమ పరువు పోకూడదని మాత్రమే ఈ లీగ్‌ను నిర్వహించాలని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన పీఎస్ఎల్ నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఈ లీగ్ లో ఆడనున్న విదేశీ ఆటగాళ్లకు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధదళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వచ్చాయని సమాచారం.


ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిని హెచ్చరిస్తూ జమాత్‌ ఉల్‌ అహ్రార్ రిలీజ్ చేసిన లేఖను ఇస్లామాబాద్‌ పోస్ట్‌ తన ‘ఎక్స్‌’లో పంచుకుంది. ' ఇటీవల అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైబర్‌ పఖ్తుంఖ్వా, బెలూచిస్థాన్‌ ఫ్రావిన్స్‌ ప్రాంతాల ప్రజలపై పాకిస్థాన్‌ అమానుష దాడులకు పాల్పడుతుంది. మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టికాలను గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించాం' అని లేఖలో పేర్కొంది.


'ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్‌కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. మేము క్రికెట్ కు వ్యతిరేకం కాదు.. అయితే విదేశీయులు ఆడేందుకు పాకిస్థాన్ అనువైన ప్రాంతం కాదు. పీఎస్‌ఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్ కి రావొద్దు. ఇప్పటికే వచ్చివుంటే పాక్‌ విడిచి వెళ్లిపోతే మంచిది’ అని లేఖలో పేర్కొంది.


పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్‌తో వైరం కారణంగా పీఎస్‌ఎల్‌లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంతలో పాకిస్థాన్‌ రెబల్స్ నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. తాజా బెదిరింపులతో అసలు పీఎస్‌ఎల్‌ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

18 ఏళ్ల ప్రయాణం నా కళ్ల ముందు మెదిలింది: విరాట్ భావోద్వేగం

జట్టుకు ఆరో టైటిల్ అందించడమే మా ఆశయం: హార్దిక్ పాండ్య

Updated Date - Mar 23 , 2026 | 04:11 PM