పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:06 PM
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచాడు. తన ఇళ్లకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. అమృత్‌సర్‌లోని ఇంటిని తన కుమార్తె రబియా సిద్ధుకు, పాటియాలాలోని తన పూర్వీకుల ఇంటిని తన కుమారుడు కరణ్ సిద్ధుకు నవజ్యోత్ అప్పగించాడు. క్రికెటర్ స్థాయి నుంచి టెలివిజన్ కార్యక్రమాల వరకు తన జీవితంలోని వివిధ దశలలో తాను పడిన ఏళ్ల కృషికి, శ్రమకు ఈ ఇళ్లు ప్రతీక అని ఆయన వివరించాడు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కృతజ్ఞతా భావాన్ని కూడా ఆయన తన పోస్ట్‌లో వ్యక్తం చేశాడు. ఈ ఆస్తులు తనకు లభించిన దేవుడి ఆశీర్వాదాల్లా ఉన్నాయని, ఇప్పుడు వాటిని తన పిల్లలకు ఇస్తున్నానని పేర్కొన్నాడు.
అతడు డాక్టర్, రాజకీయ నాయకురాలైన నవజ్యోత్ కౌర్ సిద్ధును వివాహం చేసుకున్నాడు. కాగా అమృత్‌సర్‌లోని ప్రీమియర్ లొకాలిటీలో సిద్ధు కట్టిన ఇల్లు 49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. 2014-15 మధ్య కాలంలో నిర్మించిన ఈ ఇంటి విలువ దాదాపు రూ. 25 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో స్విమ్మింగ్‌పూల్, జిమ్, స్పా వంటి వసతులు ఇందులో ఉన్నాయట. ఈ విలాసవంతమైన ఇంటిలో ప్రత్యేకంగా శివుడి కోసం చిన్న ఆలయం కూడా నిర్మించినట్లు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రతిష్ఠించిన శివలింగం దాదాపు రూ. 2.5 కోట్ల విలువ ఉంటుందని కొన్ని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
ఇక సిద్ధు క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన అతడు1983- 1999 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతడి కెరీర్‌లో మొత్తంగా 51 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3202, వన్డేల్లో 4413 పరుగులు సాధించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా కూడా కొనసాగాడు. అలానే టీవీ షోల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఇదే సమయంలో రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన నవజ్యోత్ సింగ్ సిద్ధు రెండుసార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!