Share News

భారత్-విండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. భువీ రీఎంట్రీకి బ్రేక్ పడనుందా?

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:15 PM

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగనున్న ఐదో టీ20కి వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ నిర్ణయాత్మక పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.

భారత్-విండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. భువీ రీఎంట్రీకి బ్రేక్ పడనుందా?
India vs West Indies 5th T20

ఇంటర్నెట్ డెస్క్: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగనున్న ఐదో టీ20కి వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఈ నిర్ణయాత్మక పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కారణంగా కీలక పోరుకు అంతరాయం కలగడమే కాకుండా.. జాతీయ జట్టు తరఫున భువనేశ్వర్ కుమార్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే మిగులుతుంది. నాలుగో టీ20లో గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో భువీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


వాతావరణ సూచనల ప్రకారం.. టాస్‌ పడే సాయంత్రం 6.30 గంటల సమయంలో వర్షం కురిసే అవకాశం 49 శాతం నుంచి 34 శాతం మధ్య ఉంది. మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత ఓ మూడు గంటలు వర్షం ముప్పు కొనసాగనుంది. రాత్రి 10 గంటల సమయంలో వర్షం పడే అవకాశాలు ఏకంగా 78 శాతానికి చేరనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీంతో మ్యాచ్‌ పూర్తిస్థాయిలో జరుగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచ స్థాయి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. భారీ వర్షం కురిస్తే మ్యాచ్‌ నిర్వహణ కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ మైదానం సాధారణంగా భారీ స్కోర్లకు అనుకూలంగా ఉంటుంది. ఫ్లాట్‌ పిచ్‌, చిన్న బౌండరీల కారణంగా బ్యాటర్లు సులభంగా పరుగులు సాధిస్తుంటారు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అదే జరిగితే సిరీస్ డ్రాగా ముగుస్తుంది.


స్వదేశంలో భారత్‌ రికార్డుపై కన్ను!

భారత్‌లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో ఓడిన భారత జట్టు.. ఆ తర్వాత వరుసగా 20 సిరీస్‌లలో స్వదేశంలో పరాజయం చవిచూడలేదు. ఈ రికార్డును కొనసాగించాలంటే నిర్ణయాత్మక ఐదో టీ20లో గెలవాల్సిందే. విండీస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ భారత బౌలర్లు రాణిస్తారా? భువీ పునరాగమనం చేస్తాడా? లేక వరుణుడు సిరీస్‌ ఫలితాన్ని తేల్చకుండా అడ్డుకుంటాడా? అన్నది వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 17 , 2026 | 05:15 PM