Share News

Ind Vs NZ: సిరీస్ కివీస్‌దే.. ఆఖరి వన్డేలో టీమిండియా ఓటమి..

ABN , Publish Date - Jan 18 , 2026 | 09:42 PM

ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓడింది. ఈ మూడు వన్డేల సిరీస్‌ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది..

Ind Vs NZ: సిరీస్ కివీస్‌దే.. ఆఖరి వన్డేలో టీమిండియా ఓటమి..
Ind Vs NZ

ఇంటర్నెట్ డెస్క్: ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 296 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్‌పై 41 పరుగుల తేడాతో ఓడింది. విరాట్ కోహ్లీ(124) సెంచరీతో చెలరేగినా.. జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మూడు వన్డేల సిరీస్‌ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత రెండు, మూడో వన్డేల్లో కివీస్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ అజేయంగా నిలిచింది.


తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(53), హర్షిత్ రాణా(52) అర్థ శతకాలతో రాణించారు. కోహ్లీతో కలిసి నితీశ్ ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. హర్షిత్ రాణా వచ్చాక మళ్లీ మ్యాచ్ టీమిండియా వైపు వచ్చినట్టే అనిపించింది. బౌండరీలు బాదుతూ కోహ్లీతో ఏకంగా 99 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ, హర్షిత్ ఆఖరి వరకు వరకు మ్యాచ్ భారత్‌దే అనుకుంటున్న సమయంలో హర్షిత్ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(23) విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1), రవీంద్ర జడేజా(12), సిరాజ్(0), కుల్దీప్ యాదవ్(5), అర్ష్‌దీప్ సింగ్(4) తీవ్రంగా నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో ఫోక్స్, క్లార్క్ తలో మూడు, లెనాక్స్ 2, జెమీసన్ ఒక వికెట్ పడగొట్టారు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును.. డారిల్ మిచెల్(137) తన దూకుడుతో భారీ సెంచరీ చేసి గాడిలో పెట్టాడు. ఓపెనర్లు కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరగా.. డారిల్ మిచెల్(137), విల్ యంగ్(30) ఆదుకున్నారు. యంగ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(106) చెలరేగాడు. మిచెల్, ఫిలిప్స్ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లు ఎలాంటి ప్రణాళికలు వేసినా ఫలించలేదు. మిచెల్ ఔటయ్యాక.. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిచెల్ హే(2), ఫోక్స్(10), క్లార్కే(11) విఫలమయ్యారు. కెప్టెన్ బ్రేస్‌వేల్(28*), జెమీసన్(0*) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో మూడు, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి..

మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్

అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318

Updated Date - Jan 18 , 2026 | 09:59 PM