Share News

India Under 19: చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. క్లీన్ స్వీప్ చేసిన భారత్

ABN , Publish Date - Jan 07 , 2026 | 09:47 PM

యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సారథ్యంలోని యువ భారత్ జట్టు సౌతాఫ్రికాను తమ స్వదేశంలోనే మట్టికరిపించింది. మూడు యూత్ వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి దక్షిణాఫ్రికా గడ్డపై జయభేరి మోగించింది.

India Under 19: చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. క్లీన్ స్వీప్ చేసిన భారత్
India Under 19

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా అండర్‌-19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను యువ భారత్(India U19 vs South Africa U19) 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా 233 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్ ఓపెనర్లు శతకాలతో చెలరేగడంతో సఫారీ జట్టు ముందు భారత్ భారీ టార్గెట్ ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (127) మరోసారి విధ్వంకర ఇన్నింగ్స్ ఆడి సూపర్ సెంచరీ సాధించాడు. అలానే మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (118) కూడా శతకం బాదాడు.


అలానే భారత బ్యాటర్లు వేదాంత్ త్రివేది (34), మహ్మద్‌ ఎషాన్ (28*), హెనిల్ పటేల్ (19*), అభిజ్ఞాన్ కుందు (21) పరుగులు చేశారు. ఓపెనర్లు వైభవ్, జార్జ్ తొలి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా సెంచరీతో వైభవ్ ఓ వరల్డ్ రికార్డు(Vaibhav Suryavanshi record) సృష్టించాడు. యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడైన అండర్-19 కెప్టెన్‌గా ఘనత సాధించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీ కావడంతో వైభవ్ తొలిసారి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సోని మూడు వికెట్లు సాధించగా.. జాసన్ రౌల్స్ 2, మైఖేల్ క్రూయిస్కాంప్ ఒక వికెట్ తీసుకున్నారు.


ఇక భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా(South Africa U19) జట్టు.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. 35 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. పాల్ జేమ్స్ (41), డేనియల్ బోస్మాన్ (40), కార్న్ బోథా (36*) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. టాప్-4 బ్యాటర్లలో ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో కిషాన్ కుమార్ సింగ్ 3 వికెట్లు తీశాడు. అలానే మహ్మద్ ఎనాన్ 2, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, అంబరీష్‌, వైభవ్ తలో వికెట్ సాధించారు. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌' అవార్డూ అందుకున్నాడు.


ఇవీ చదవండి:

Vaibhav Suryavanshi: వైభవ్ దండయాత్ర.. జడుసుకున్న సఫారీ బౌలర్లు

Bangladesh: గొప్పల కోసం తిప్పలు పడుతున్న బంగ్లా క్రికెట్ బోర్డు

Updated Date - Jan 07 , 2026 | 09:55 PM