Arjun Tendulkar Marriage: అర్జున్ టెండుల్కర్ వివాహం! డేట్ ఫిక్సైనట్టేనా..
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:10 PM
అర్జున్ టెండుల్కర్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నాడు. మార్చ్ 5న అతడి వివాహం జరగనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది ముంబై పారిశ్రామికవేత్త మనవరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) నిశ్చితార్థం గతేడాది జరిగింది. ముంబై పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మార్చ్‌లోనే వారు పెళ్లిపీటలెక్కనున్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై సచిన్ కుటుంబం స్పందించాల్సి ఉంది (Arjun Tendulkar Marriage Date).
గతేడాది ఆగస్టులో అర్జున్, సానియాల నిశ్చితార్థం జరిగింది. సన్నిహితులు, స్నేహితుల మధ్య గోప్యంగా ఈ వేడుక జరిగింది. ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల గురించి అభిమానులు ఎక్స్ వేదికగా సచిన్‌ను ప్రశ్నించారు. దీంతో, సచిన్.. తన తనయుడి నిశ్చితార్థం జరిగిందని తొలిసారిగా ధ్రువీకరించారు. అతడు తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కూడా కామెంట్ చేశారు.
ఇక జాతీయ మీడియా ప్రకారం, మార్చ్ 5న అర్జున్, సానియాల వివాహం జరగనుంది. మార్చ్ 3 నుంచే ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే, నిశ్చితార్థం లాగానే పెళ్లిని కూడా నిరాడంబరంగా అత్యంత సన్నిహితులు, ఇతర ప్రముఖుల మధ్య నిర్వహించేలా సచిన్ కుటుంబం ప్లాన్ చేస్తోంది. పలువురు క్రికెట్ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు.
ఇక దేశవాళీ క్రికెట్ రోజుల నుంచీ అర్జున్ టెండుల్కర్ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ముంబై జట్టు తరపున ప్రయాణం మొదలెట్టిన అతడు ఆ తరువాత గోవా జట్టులో కీలక ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్ నుంచి లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు మారాడు. ఇక సానియా తాతయ్య రవి ఘాయ్ హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఆయన అడుగు జాడల్లోనే సానియా కూడా ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు.
ఇవీ చదవండి:
అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నా.. ఆ వార్తల్లో నిజం లేదు: రిధిమా పాఠక్