Harbhajan Singh Slapgate: హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:11 AM
2008 నాటి ఐపీఎల్‌లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్ వివాదానికి సంబంధించి అరుదైన వీడియోను మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ విడుదల చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: హర్భజన్ సింగ్-శ్రీశాంత్ వివాదం..ఐపీఎల్ తొలి సీజన్‌ను కుదిపేసింది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ఘటనల్లో ఇదీ ఒకటి. హర్భజన్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతకుముందు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియక అందరూ ఆశ్చర్యపోయారు. 2008 నాటి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ తరువాత జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఏదోక సందర్భంలో ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఓ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఈ వీడియోను విడుదల చేశారు. ఎమ్ఐ జెర్సీని ధరించిన హర్భజన్ సింగ్ పంజాబ్ జట్టుకు చెందిన శ్రీశాంత్‌పై చేయిచేసుకున్న వైనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఉదంతంపై మైఖేల్ క్లార్క్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ ఇటీవల మాట్లాడుతూ ఈ ఫుటేజీని అప్పట్లో ప్రసారం చేయలేదని అన్నారు. ‘అక్కడ ప్లేయర్లు అందరూ ఉన్నారు. భజ్జీ (హర్భజన్), శ్రీశాంత్ కూడా ఉన్నారు. మ్యాచ్ తరువాత అందరూ కరచాలనం చేసుకుంటున్నారు. ఇంతలో భజ్జీ అకస్మాత్తుగా శ్రీశాంత్ చెంప పగలగొట్టాడు’ అని లలిత్ మోదీ తెలిపారు. ‘వాళ్ళిద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి మట్లాడా. భజ్జీకి శిక్ష వేయకతప్పలేదు’ అని తెలిపాడు.
ఈ ఉదంతంపై హర్భజన్ సింగ్ ఆ తరువాత పలుమార్లు విచారం వ్యక్తం చేశారు. శ్రీశాంత్‌కు బహిరంగ వేదికలపైనా క్షమాపణలు చెప్పారు. తన జీవితంలో మార్చాలనుకుంటున్న ఘట్టం ఏదైనా ఉందీ అంటే అది ఇదేనని పలుమార్లు హర్భజన్ చెప్పుకున్నారు. ఈ ఘటన జరిగి ఏళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ బాధగానే ఉంటుందని ఇటీవల రవిచంద్ర అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. తన తండ్రిపై చేయి చేసుకున్న వ్యక్తిగా శ్రీశాంత్ కూతురు తనను భావించడం మనసును తీవ్రంగా గాయపరిచిందని తెలిపారు. ఇప్పటికీ శ్రీశాంత్ కూతురు కనిపించిన ప్రతిసారీ క్షమాపణలు చెబుతానని అన్నాడు.
ఇవి కూడా చదవండి
బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి