BCCI Rajeev Shukla: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:35 PM
భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ తప్పుకోవడంతో, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
భారత క్రికెట్ బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవిలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా సేవలందించిన రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మార్పు తాత్కాలికమే అయినప్పటికి, సెప్టెంబర్‌లో బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు శుక్లా ఈ బాధ్యతలను నిర్వహిస్తారని ఓ నివేదిక తెలిపింది.
గతంలో శుక్లా..
రాజీవ్ శుక్లా ఇంతకు ముందు కూడా భారత క్రికెట్‌లో కీలక పాత్రలు పోషించారు. 2015లో ఐపీఎల్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020 డిసెంబర్‌లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం ఆయనకు కొత్తేమీ కాదు. శుక్లా అనుభవం, నాయకత్వం బీసీసీఐకి ఈ ఎన్నికల సమయంలో ఎంతగానో ఉపయోగపడనుంది.
రోజర్ బిన్నీ మళ్లీ అధ్యక్షుడవుతారా?
రోజర్ బిన్నీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కలిగి ఉన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే, ఆయన మళ్లీ అధ్యక్షుడిగా తిరిగి రావచ్చు. ఒకవేళ గెలవకపోతే, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా అధికారికంగా నియమితులయ్యారని ఓ నివేదిక తెలిపింది. ఈ సమావేశంలో మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చింది. టీమ్ ఇండియాకు కొత్త ప్రధాన స్పాన్సర్‌ను గుర్తించడం. డ్రీమ్11 ఇటీవల స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో ఏ కంపెనీని ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కొత్త నిబంధనలు, నియమాలు
ఇటీవల పార్లమెంట్‌లో కొత్త నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ ఆమోదం పొందింది. కానీ, ఇది అమల్లోకి రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం పడుతుంది. అప్పటివరకు బీసీసీఐ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తుంది. ఈ రాజ్యాంగం సుప్రీంకోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది.
అందుకే, రాబోయే వార్షిక సాధారణ సభ (AGM), ఎన్నికలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే జరుగుతాయి. లోధా కమిటీ రూల్స్ ప్రకారం, బీసీసీఐ అధికారుల వయస్సు పరిమితి 70 సంవత్సరాలు. కొత్త చట్టం అమలులోకి వచ్చాక 70 నుంచి 75 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి