Share News

2031 వన్డే ప్రపంచ కప్: భారత్‌కే ఆతిథ్య హక్కులు

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:24 PM

భారత క్రికెట్‌ అభిమానులకు మరో శుభవార్త. 2031 వన్డే ప్రపంచకప్‌ నిర్వహణ హక్కులను భారత్‌ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.

2031 వన్డే ప్రపంచ కప్: భారత్‌కే ఆతిథ్య హక్కులు
2031 ODI World Cup

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ అభిమానులకు మరో శుభవార్త. 2031 వన్డే ప్రపంచకప్‌ నిర్వహణ హక్కులను భారత్‌ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌ కూడా ఈ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది. అంతేకాకుండా 2029 ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను కూడా భారత్‌కే అప్పగిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో 2035 వరకు జరగనున్న పురుషుల క్రికెట్‌లోని ప్రధాన టోర్నీల విండోలను ఖరారు చేసి ఆమోదించారు. కాగా 2027, 2029, 2031 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.


భారత్‌లో ఐదోసారి వన్డే ప్రపంచకప్‌

వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి కానుండటం విశేషం. తొలిసారిగా 1987లో ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 1996లో పాకిస్థాన్‌, శ్రీలంకతో కలిసి నిర్వహించింది. 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో కలిసి మరోసారి ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇక 2023లో పూర్తిస్థాయి ఆతిథ్య దేశంగా వ్యవహరించింది. ఆ టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరినా.. అహ్మదాబాద్‌లో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు 2031లో మరోసారి ప్రపంచకప్‌ నిర్వహణ బాధ్యతలు భారత్‌కు దక్కాయి.


23 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ..

ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం 2006 తర్వాత ఇదే తొలిసారి. అంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ మళ్లీ భారత్‌లో జరగనుంది. 2029 అక్టోబర్‌ 9 నుంచి 28 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.


2035 వరకు ఐసీసీ మెన్స్ క్రికెట్ టోర్నీల షెడ్యూల్‌ ఇదే..

  • 2028: టీ20 ప్రపంచకప్‌ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ (అక్టోబర్‌ 12 - నవంబర్‌ 12)

  • 2029: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ - ఇంగ్లండ్‌ (జూన్‌ 8-12)

  • 2029: ఛాంపియన్స్‌ ట్రోఫీ - భారత్‌ (అక్టోబర్‌ 9-28)

  • 2030: టీ20 ప్రపంచకప్‌ - ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ (జులై 4 - ఆగస్టు 4)

  • 2031: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ - ఇంగ్లండ్‌ (జూన్‌ 12-16)

  • 2031: వన్డే ప్రపంచకప్‌ - భారత్‌, బంగ్లాదేశ్‌ (అక్టోబర్‌ 9 - నవంబర్‌ 23)

  • 2032: టీ20 ప్రపంచకప్‌ - ఆతిథ్య దేశాలు ఖరారు కావాల్సి ఉంది (అక్టోబర్‌ 14 - నవంబర్‌ 14)

  • 2033: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ - వేదిక ఖరారు కావాల్సి ఉంది (జూన్‌ 9-13)

  • 2033: ఛాంపియన్స్‌ ట్రోఫీ - వేదిక ఖరారు కావాల్సి ఉంది (అక్టోబర్‌ 2-23)

  • 2034: టీ20 ప్రపంచకప్‌ - వేదిక ఖరారు కావాల్సి ఉంది (జులై 6 - ఆగస్టు 6)

  • 2035: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ - వేదిక ఖరారు కావాల్సి ఉంది (జూన్‌ 7-11)

  • 2035: వన్డే ప్రపంచకప్‌ - వేదిక ఖరారు కావాల్సి ఉంది (అక్టోబర్‌ 2 - నవంబర్‌ 18)


ఇవి కూడా చదవండి:

బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్

డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ

Updated Date - Nov 15 , 2026 | 08:39 PM