కోహ్లీ మద్దతు లేకపోయి ఉంటే ఆర్సీబీకి కెప్టెన్‌గా చేసేవాడిని కాదు: ఫాఫ్ డుప్లెసిస్
ABN , Publish Date - Nov 15 , 2026 | 07:44 PM
ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. అయితే 2022లో కోహ్లీ నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు తనకు ఎదురైన సవాళ్ల గురించి ఫాఫ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీ అంటేనే విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు. అయితే 2022లో కోహ్లీ నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు తనకు ఎదురైన సవాళ్ల గురించి ఫాఫ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తనకు కోహ్లీ నుంచి మొదటి రోజు నుంచే పూర్తి మద్దతు లభించిందని వెల్లడించాడు. అంతేకాదు.. కోహ్లీతో ఏర్పడిన స్నేహం తనకు ఖరీదైన అలవాటును కూడా పరిచయం చేసిందని సరదాగా చెప్పుకొచ్చాడు.
‘ఆర్సీబీకి కోహ్లీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన అతడికి బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. అలాంటి ఆటగాడి నుంచి కెప్టెన్సీ తీసుకున్నప్పుడు సహజంగానే కొత్త కెప్టెన్‌పై అంచనాలు ఉంటాయి. ఆర్సీబీ తరఫున కెప్టెన్‌గా ఒక మ్యాచ్ ఓడిపోయినా చాలు.. బెంగళూరుతో పాటు దేశమంతా మళ్లీ విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటుంది. అది నన్ను ఇష్టపడకపోవడం వల్ల కాదు. వారికి కోహ్లీపై ఉన్న అభిమానం అలాంటిది. అయితే ఈ పరిస్థితిని నేనెప్పుడూ తప్పుగా భావించలేదు. ఆర్సీబీ వంటి భారీ అభిమానగణం ఉన్న జట్టుకు నాయకత్వం వహిస్తే ఇలాంటి ఒత్తిడి సహజం. ఆ మూడేళ్లలో కోహ్లీ మద్దతు నాకు లేకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించేవాడిని కాదేమో అని అనిపిస్తుంటుంది.
కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే కోహ్లీ నాకు పూర్తి మద్దతు ఇచ్చాడు. ప్రతి సందర్భంలోనూ నా వెంటే నిలిచాడు. మేం ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఆడుకున్నాం. కానీ ఆర్సీబీలోకి వచ్చిన వెంటనే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దానికి ప్రత్యేకమైన నేపథ్యం ఏమీ లేదు. సహజంగానే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం కుదిరింది. అయితే కోహ్లీతో స్నేహం వల్ల నాకు ఓ కొత్త అలవాటు వచ్చింది. నేను ఇప్పుడు పెద్ద వాచ్ లవర్‌గా మారిపోయాను. ఇప్పుడు నేను ఒక వాచ్ కోసం అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నానని అందరూ అడుగుతుంటారు. నేను ఎప్పటికీ కొనకూడదనుకున్న వాచీలను కూడా కోహ్లీ వల్లే కొనాల్సి వచ్చింది’ అని డుప్లెసిస్ చమత్కరించాడు.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ