ఐర్లాండ్‌తో ఘోర ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:55 AM
ఐర్లాండ్‌పై రెండు టీ20ల్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ టీమిండియాను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌పై రెండు టీ20ల్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ టీమిండియాను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం, బ్యాలెన్స్‌గా లేని జట్టు కూర్పు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాల వల్లే పసికూన ఐర్లాండ్‌పై భారత్ చిత్తు అయిందని నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. గంభీర్ నేతృత్వంలో టెస్టులు మాత్రమే కాదు.. పొట్టి ఫార్మాట్‌లో కూడా భారత్ రాణించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ సిరీస్ ఓటమిపై ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది. ‘గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకోవాలని మేము కోరుకోవడం లేదు. ఆయనకు ప్రతిభ ఉన్నప్పటికీ.. ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలు సాధించడం నిజంగా ప్రత్యేకం. అలాంటి కోచ్ మాకొద్దు’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొంది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం: సంజయ్ మంజ్రేకర్
ఐర్లాండ్‌పై 2-0 తేడాతో సిరీస్ ఓడిపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. భారత జట్టులో అవసరానికి మించిన ‘ఆల్‌రౌండర్లు’ ఉన్నారని, కానీ స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేడని అభిప్రాయపడ్డాడు. ‘ఇంతకుముందు తక్కువగా ఉండేవారు.. ఇప్పుడు ఎక్కువ అయిపోయారు. భారత్‌కు ప్రస్తుతం ఒక ప్యూర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం. భారత బ్యాటర్లు విదేశీ పిచ్‌లపై తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లను క్రమంగా టీ20 జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. శుభ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించగలరు’ అని పేర్కొన్నాడు.
వైభవ్‌ను ఆడించాల్సింది!
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో సీనియర్ జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐర్లాండ్‌తో రెండో టీ20లో ఇద్దరు యువ ప్లేయర్లు అరంగేట్రం చేసినప్పటికీ వైభవ్‌కు మాత్రం అవకాశం రాలేదు. ఈ విషయంపై కూడా నెట్టింట చర్చ మొదలైంది. అరంగేట్రంలోనే ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో రాణించినప్పటికీ.. సూర్యాంశ్ తీవ్రంగా విఫలమయ్యాడు. అయితే వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక భారత్ జట్టు ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. జులై 1 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్
ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా