యూఎస్ ఓపెన్: రన్నరప్‌గా కిదాంబి శ్రీకాంత్
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:02 AM
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన సు లియాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన సు లియాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. గంటకు పైగా సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్ కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని సమం చేసినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి వేగానికి తట్టుకోలేక టైటిల్‌ను చేజార్చుకున్నాడు. ఈ సీజన్‌లో శ్రీకాంత్‌కు ఇది తొలి ఫైనల్ కాగా.. మొత్తంగా రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది మలేషియా మాస్టర్స్ సూపర్-500, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీల్లోనూ అతడు రెండో స్థానంలో నిలిచాడు.
మాజీ ప్రపంచ నంబర్ వన్ 33 ఏళ్ల శ్రీకాంత్ మ్యాచ్‌ను వేగంగానే ఆరంభించాడు. అయితే ఒక ర్యాలీలో రాకెట్ నెట్ దాటడంతో లభించిన ఫాల్ట్ కారణంగా అతడి లయ దెబ్బతింది. వరుస అనవసర తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న ప్రపంచ 46వ ర్యాంకర్ సు లియాంగ్ తొలి గేమ్‌లో ఆధిపత్యం చెలాయించాడు. మధ్యలో శ్రీకాంత్ 10-10తో స్కోరును సమం చేసినప్పటికీ, విరామం తర్వాత ప్రత్యర్థి వేగాన్ని మరింత పెంచి తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం శ్రీకాంత్ తన అనుభవాన్ని ప్రదర్శించాడు. శక్తివంతమైన స్మాష్‌లు, అద్భుతమైన నెట్ ప్లేతో ఆధిక్యం సాధిస్తూ 21-16తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. అయితే చివరి గేమ్‌లో సు లియాంగ్ దూకుడు పెంచాడు. వేగవంతమైన షాట్లతో శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చి భారీ ఆధిక్యం సాధించాడు. వరుస పాయింట్లు సాధించి 21-9తో గేమ్‌తో పాటు తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్
ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా