అర్జెంటీనా..అజేయంగా
ABN , Publish Date - Jun 29 , 2026 | 03:59 AM
వరల్డ్ కప్‌ను నిలబెట్టుకొనే దిశగా అర్జెంటీనా జట్టు మరో అడుగు వేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ ముందుండి నడిపిస్తుండగా వరుస విజయాలతో పరుగులు పెడుతోంది.
ఫిఫా ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జోరు మామూలుగా లేదు..కెప్టెన్ మెస్సీతోపాటు ఇతర స్టార్లు అదరగొడుతుండడంతో మెగా టోర్నీలో ఆ జట్టు దూసుకుపోతోంది..సారథి లియోనెల్ మెస్సీ, గియోని లో సెల్సో, లా మెర్టినెజ్ మెరిసిన వేళ విజయాల హ్యాట్రిక్ కొట్టింది. గ్రూప్ దశను అజేయంగా ముగించింది.. నాకౌట్ సమరానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది.
ముగిసినలీగ్ దశ
అర్లింగ్టన్ (యూఎస్): వరల్డ్ కప్‌ను నిలబెట్టుకొనే దిశగా అర్జెంటీనా జట్టు మరో అడుగు వేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ ముందుండి నడిపిస్తుండగా వరుస విజయాలతో పరుగులు పెడుతోంది. గ్రూప్ ‘జె’లో ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 3-1తో జోర్డాన్‌ను చిత్తు చేసింది. గియోని లో సెల్సో (19వ ని.), లా మార్టినెజ్ (31వ ని.), మెస్సీ (80వ ని.) అర్జెంటీనాకు గోల్స్ అందించారు. అల్ తామరి (55వ ని.) జోర్డాన్ తరపున ఏకైక గోల్ చేశాడు. మొత్తం తొమ్మిది పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఈసారి టోర్నీలో మెస్సీకాకుండా అర్జెంటీనాకు గోల్ చేసిన తొలి ఆటగాడిగా లో సెల్సో అరుదైన ఘనత సాధించాడు. జోర్డాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు చేసిన ఐదు గోల్స్ కూడా మెస్సీ నుంచి జాలువారినవే. ఈనేపథ్యంలో జోర్డాన్‌తో పోరులో సెల్సో 19వ నిమిషంలో బుల్లెట్‌లాంటి గోల్ కొట్టి మెస్సీ కాకుండా ఈసారి టోర్నీలో తొలి గోల్ చేసిన అర్జెంటీనా ఫుట్‌బాలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఆస్ట్రియా-అల్జీరియా ఉత్కంఠ డ్రా
గ్రూప్ ‘జె’లో ఆస్ట్రియా-అల్జీరియా నడుమ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ 3-3తో ఫలితం తేలకుండా ముగిసింది. మార్కో (28వ ని.), మార్సెల్ (55వ ని.), ససా (90+6వ ని.) ఆస్ట్రియాకు గోల్స్ చేశారు. రఫిక్ (45వ ని.), కరీమ్ (60వ, 90+3వ ని.) అల్జీరియా తరపున గోల్స్ సాధించారు. ఈ రెండు జట్లు తదుపరి దశకు ముందంజ వేయగా, ఇరాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పనామాపై ఇంగ్లండ్ గెలుపు.. కేన్ రికార్డు
గ్రూప్ ‘ఎల్’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-0తో పనామాపై గెలుపొందింది. బెలింగ్‌హామ్ (62వ ని.), హ్యారీ కేన్ (67వ ని.) ఇంగ్లండ్ తరపున గోల్స్ చేశారు. ఈ గోల్ ప్రపంచ కప్‌లలో కేన్‌కు 11వది. దరిమిలా వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా కేన్ రికార్డు నెలకొల్పాడు. ఈక్రమంలో గ్యారీ లినెకర్ (10)ని కేన్ అధిగమించాడు.
నాకౌట్‌కు క్రొయేషియా
గ్రూప్ ‘ఎల్’ మరో పోరులో 2-1తో ఘనాపై నెగ్గిన క్రొయేషియా..ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. పీటర్ సుసిక్ (31వ ని.), నికోలా వ్లాసిక్ (83వ ని.) గోల్స్ కొట్టారు. లుకాసెన్ (73వ ని.) ఘనాకు ఏకైక గోల్ అందించాడు. గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన ఘనా ఇంతకుముందే రౌండ్-32 స్థానం ఖరారు చేసుకుంది.
మెస్సీ మరో చరిత్ర..
ఈసారి మెగా టోర్నీలో మెస్సీ ప్రదర్శన నభూతో..అనేలా సాగుతోంది. జోర్డాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రియాపై చేసిన రెండు గోల్స్‌తో ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ (18) సాధించిన ప్లేయర్‌గా అరుదైన చరిత్ర మెస్సీ తన పేరిట లిఖించుకున్న విషయం విదితమే. ఇక..జోర్డాన్‌తో మ్యాచ్‌లో రెండో భాగంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన 39 ఏళ్ల మెస్సీ ఫ్రీకిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈక్రమంలో వరుసగా ఏడు ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా మరో ఘనత అతడు అందుకున్నాడు. దాంతో..ఫ్రెంచ్ స్ట్రయికర్ జస్ట్ ఫాంటిన్, బ్రెజిల్ దిగ్గజం జిర్జినో పేరిట తాను సంయుక్తంగా పంచుకున్న ఆరు వరుస గోల్స్ రికార్డును మెస్సీ తిరగ రాశాడు.