హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:23 PM
హాకీ వరల్డ్ కప్ 2026లో భారత జట్టుకు షాక్ తగిలింది. సోమవారం పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 2-4తో ఓటమి పాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: హాకీ వరల్డ్ కప్ 2026లో భారత జట్టుకు షాక్ తగిలింది. సోమవారం పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 2-4తో ఓటమి పాలైంది. తొలి గోల్ ఇంగ్లండ్ సాధించినప్పటికీ.. భారత్ అద్భుతంగా పుంజుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు విజృంభించడంతో మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. మ్యాచ్ రెండో క్వార్టర్‌లో భారత జట్టు దూకుడు పెంచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్ గోల్స్ సాధించడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత అభిమానుల్లో గెలుపుపై ఆశలు పెరిగాయి.
అయితే విరామం తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతమైన పునరాగమనం చేశారు. స్టువర్ట్ రష్‌మీర్ గోల్‌తో స్కోరు సమం చేశారు. అనంతరం హెన్రీ క్రాఫ్ట్, నికోలస్ బాండురక్ చెరో గోల్ సాధించడంతో ఇంగ్లండ్ 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు భారత్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఇంగ్లండ్ 4-2తో విజయాన్ని అందుకుంది.
పాక్‌తో కీలక పోరు
ఇంగ్లండ్ చేతిలో ఓటమితో భారత్ తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. పూల్-డి తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఆగస్టు 19న తలపడనుంది. ఇంగ్లండ్‌పై ఎదురైన పరాజయాన్ని మరిచి ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని భారత జట్టు భావిస్తోంది. అభిమానుల్లోనూ భారత్-పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి:
టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా
టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం