Share News

పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:21 PM

పాకిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లు తలపడ్డాయి.

పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
India A vs Pakistan A

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లు తలపడ్డాయి. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 93 పరుగులకే పాక్ ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే... బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానంలో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లలో యుస్రా ఆమిర్‌ (1)ను సైమా ఠాకూర్‌ అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైమా సొహైల్‌ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ (1)ను ఐమా, హురైనా సజ్జద్‌ (2)ను కెప్టెన్‌ రాధా యాదవ్‌ పెవిలియన్‌కు పంపించారు.


ఎమాన్‌ నసీర్(4)ను అనుష్క శర్మ రనౌట్‌ చేసింది. అలానే వహీదా అక్తర్‌ (7)ను ప్రేమా రావత్‌,మోమినా రియాసత్(4)ను మిన్ను మణి సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ షావాల్ జుల్ఫికర్(23)తో పాటుగుల్ రుఖ్(21) పోరాడే ప్రయత్నం చేశారు. అయితే షావాల్‌కు రాధా యాదవ్‌, గుల్‌కు ప్రేమా రావత్‌ చెక్‌ పెట్టారు. ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్‌-ఎ జట్టు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకోర్‌, రాధా యాదవ్‌, ప్రేమా రావత్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అలానే జింతీమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్‌ పడగొట్టారు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాధా యాదవ్ సేన 10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ హుమైరా కాజీ డకౌట్ అయ్యింది. మరో ఓపెనర్ వ్రిందా దినేష్(55) అర్ధ సెంచరీతో రాణించింది. అనుష్క శర్మ(24), తేజల్ హసబ్నిస్(12) ఫర్వాలేదనిపించారు. వ్రిందా దినేష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాక్‌ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్‌ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన భారత్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 04:04 PM